7 గదుల అభ్యర్థులకు 3 బాత్రూమ్లే @వికలాంగుల హాస్టల్స్

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తమ కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన హాస్టల్స్ లో వికలాంగులు ఉంటూ విద్యా, ఉపాధీలో నిమగ్నమైతున్నారు. అయితే ఆ హాస్టల్స్ లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ శాఖాధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫైరవీలతో హాస్టల్ భవనాలు తీసుకొని వికలాంగులను మరింత ఇబ్బందులు పెట్టేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇరుకిరుకు గదులు, ప్రతి గదిలో ఏడుగురు… ప్రశాంతంగా పడుకునే స్వేచ్ఛ లేదు… చదువుకునే విద్యార్ధి ఉంటే ఆ రూంలో ఉండలేని దుస్థితి. అంతేకాకుండా 50 […]

Update: 2021-10-07 03:01 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తమ కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన హాస్టల్స్ లో వికలాంగులు ఉంటూ విద్యా, ఉపాధీలో నిమగ్నమైతున్నారు. అయితే ఆ హాస్టల్స్ లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ శాఖాధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫైరవీలతో హాస్టల్ భవనాలు తీసుకొని వికలాంగులను మరింత ఇబ్బందులు పెట్టేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇరుకిరుకు గదులు, ప్రతి గదిలో ఏడుగురు… ప్రశాంతంగా పడుకునే స్వేచ్ఛ లేదు… చదువుకునే విద్యార్ధి ఉంటే ఆ రూంలో ఉండలేని దుస్థితి. అంతేకాకుండా 50 మందికి మూడు బాత్రూమ్స్ మాత్రమే ఉన్నాయి. దీంతో మలవిసర్జనకుగానీ, స్నానానికి వెళ్లాలన్నా ఖచ్చితంగా గంట, రెండుగంటల సమయం వేచి చూడాల్సిందే. ఇలాంటి దుస్థితిలో వికలాంగులు హాస్టల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే, వాస్తవానికి వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండే బిల్డింగ్ నే అద్దెకు తీసుకోవాలి. కానీ, అద్దెలు అధికమైతున్నాయని.. భవనాలు దొరకడం లేదనే సాకుతో వికలాంగులకు అనుకూలమైనవి కాకుండా అంతస్తులుండే భవనాన్ని తీసుకొని అవస్థలు పెట్టిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని హస్తీనాపూర్ సంతోషీమాత కాలనీలోని వికలాంగుల హాస్టల్ ఈ విధంగానే ఉంది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 6 హాస్టల్స్ ఇలానే ఉన్నాయి. ఈ హాస్టల్స్ పరిస్థితి దారుణంగా ఉంది. వీరికి రక్షణ కల్పించి.. వారిలో మనోధైర్యం నింపాల్సిన పాలక వర్గాలు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. నిరాశ, నిస్పృహకు గురవుతున్న వికలాంగులు మా గోడు పట్టుంచుకునే వారేలేరని, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని వికలాంగుల హాస్టల్స్ వైనం…
రంగారెడ్డి జిల్లాలో వికలాంగుల వసతి గృహాలు మొత్తం 6 ఉన్నాయి. ఈ హాస్టల్స్ లో సుమారు 650 మంది వికలాంగులు ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఉన్న వసతి గృహాలు అన్ని అద్దె గృహాలు కావడంతో సమస్యలు తాండవిస్తున్నాయి. వికలాంగుల వసతి గృహాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి అన్నిరకాల వసతులు.. ప్రతి రూంలో అటాచ్ బాత్రూమ్, లిఫ్ట్ సౌకర్యం, ప్రశాంతమైన వెంటిలేషన్, విద్యుత్, ఇంటర్నెట్ కనెక్షన్.. ఇక రవాణ సౌకర్యార్థంగా ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్లను మాత్రమే అద్దెకు తీసుకోవాల్సి ఉంది. కానీ, జిల్లాలో ప్రస్తుతం ఉన్న వికలాంగుల వసతి గృహాల్లో ఇలాంటి సౌకర్యాలు ఎక్కడా కనిపించడం లేదు.

నర్సులే వార్డెన్లు…
ప్రతి వికలాంగుల వసతి గృహానికి ఒక వార్డెన్ ఉండాలి. కానీ, వికలాంగుల ఆరోగ్య పరిస్థితులను చూసుకుంటున్న నర్సుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో 6 వసతి గృహాలకు ఒక వార్డెన్ మాత్రం ఉంది. మిగతా నలుగురు ఇన్ చార్జ్ వార్డెన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వసతి గృహాల్లో విద్యార్థుల సమస్యలు తారస్థాయికి చేరుతున్నాయి. తమ బాధలు గుర్తించే స్థితిలో వార్డెన్లు లేరని విద్యార్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వికలాంగుల వసతి గృహంలో ఒక ఫిజియోథెరఫీ డాక్టర్ ఉండాల్సి ఉంది. ప్రతి మూడు రోజులు లేదా వారంలో ఒకరోజు అయినా వివిధ కారణాలతో నడువలేని స్థితిలో ఉన్న విద్యార్థులను వ్యాయమం చేయించడం, కాళ్లు, చేతులు కదింలించే ప్రయత్నాలు చేస్తూ చికిత్స అందించాల్సి ఉంది. కానీ, ఇక్కడ ఫిజియోథెరఫీ డాకర్ట్ ఇప్పటివరకూ వచ్చిందే లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా గోడు ప్రభుత్వం పట్టించుకోవాలి: విజయ్ శేఖర్(వికలాంగుడు)
ప్రస్తుతం మేము ఉంటున్న బిల్డింగ్ లో సరైన వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఒక గది ఏడుగురికి కేటాయించడంతో ఇబ్బందికరంగా ఉంది. లిఫ్ట్ మాకు అనుకులంగా లేకపోవడంతో పైకి కిందికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నాం. బాత్రూమ్స్ సరిపడలేకపోవడంతో గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. అధికారులు మా సమస్యలను పట్టించుకుని వాటిని పరిష్కరించాలి. ప్రభుత్వం మా పట్ల ప్రత్యేక చొరవ తీసుకుని స్వయం ఉపాధి కోసం ఆర్ధిక సాయం కింద రూ. 5 లక్షలు ఇచ్చి మనో ధైర్యం నింపాలి.

లిఫ్ట్ తో ఇబ్బందులు పడుతున్నాం: సైదులు, పీజీ స్టూడెంట్(వికలాంగుడు)
మేముంటున్న భవనంలో లిఫ్ట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. భోజనానికి డైనింగ్ హాల్ కు పోవాలంటే భయమేస్తోంది.. పోకపోతే కడుపు మాడుతుంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. మా బాధలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదు.

Tags:    

Similar News