వంద రోజుల పనుల్లో..నిబంధనలకు బొంద..!
దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో గ్రామాల్లో చాలా మందికి వందరోజుల పనే ఆధారంగా మారింది. ఉపాధి పనులు గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో జిల్లా అధికార యంత్రాంగం ఉపాధి పనుల కల్పనపై దృష్టి సారించింది. గతంలో ఉపాధి కూలీలకు చెల్లించే రూ.211కు అదనంగా రూ.26 జోడించి రూ.237 కూలీని చెల్లించే కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. ఉమ్మడి […]
దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో గ్రామాల్లో చాలా మందికి వందరోజుల పనే ఆధారంగా మారింది. ఉపాధి పనులు గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో జిల్లా అధికార యంత్రాంగం ఉపాధి పనుల కల్పనపై దృష్టి సారించింది. గతంలో ఉపాధి కూలీలకు చెల్లించే రూ.211కు అదనంగా రూ.26 జోడించి రూ.237 కూలీని చెల్లించే కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులు ప్రారంభమయ్యాయి. కానీ, పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు, సోషల్ డిస్టెన్స్(సామాజిక దూరం), ఇతర నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాబ్ కార్డుల వివరాల్లోకెళితే..మహబూబ్‌నగర్ జిల్లాలో 1,29,616, వనపర్తిలో 1,27,000, జోగుళాంబ గద్వాలలో 1,46,383, నారాయణపేటలో 93,206, నాగర్ కర్నూల్‌లో 1,79,000 మంది జాబ్ కార్డులు కలిగి ఉన్నారు. అధికారుల వివరాల ప్రకారంఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,613 గ్రామ పంచాయతీలలో పనులు ప్రారంభించారు. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లాలో 457 గ్రామ పంచాయతీలలో 42,500 మందికిపై చిలుకు మంది ఉపాధి పనులకు హాజరవ్వగా అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని మొత్తం 218 గ్రామ పంచాయతీలలో 13,470 మంది మాత్రమే ఉపాధి పనులకు వస్తున్నారు. వనపర్తిలోని 217 గ్రామ పంచాయితీల్లో 18,544, నారాయణపేటలోని 280 గ్రామ పంచాయతీల్లో 22,835, మహబూబ్‌నగర్ జిల్లాలోని 441 పంచాయతీలలో 50,604 మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. హాజరవుతున్న వారిలో జాబ్ కార్డులు లేని వారూ ఉన్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో వర్క్స్‌లో సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని తెలుస్తోంది. పనులు జరుగుతున్న చోట సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని కూలీలు అంటున్నారు. పనుల గుర్తింపులోనూ జాప్యం కారణంగా చాలా గ్రామాల్లో ఉపాధి పనులు నేటికీ ప్రారంభం కాలేదు. దీంతో ఉపాధి పనులకు అక్కడి కూలీలకు ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పనుల గుర్తింపు బాధ్యతలు అప్పగించడంతో ఈ జాప్యం ఏర్పడుతుందని పలువురు కూలీలు అభిప్రాయపడుతున్నారు.
Tags: covid 19 prevention, migrant workers, social distance, not following, corona virus