ఓటర్లకు చుక్కలు చూపిస్తున్న హుజూరాబాద్ బై పోల్.. పారిపోతున్న జనాలు..!

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్​ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్‌కు చేరుతోంది. ప్రధానంగా మూడు పార్టీలు ఓటర్ల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీల ప్రచారం సాధారణమే అయినప్పటికీ.. హుజూరాబాద్​బై ఎలక్షన్​మాత్రం విచిత్రంగా మారింది. రోజు రోజుకూ ప్రచారపర్వం అక్కడి ప్రజలకు తిప్పలు తెచ్చి పెడుతోంది. ఒక దశలో ఓటర్లు.. నేతలపై కసురుకుంటున్నారు. సాగు పనుల సమయంలో పొలాల దగ్గరకు వెళ్లి ప్రచారం చేస్తుండటం మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. మూడు ప్రధాన […]

Update: 2021-10-23 20:00 GMT
Huzurabad
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్​ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్‌కు చేరుతోంది. ప్రధానంగా మూడు పార్టీలు ఓటర్ల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీల ప్రచారం సాధారణమే అయినప్పటికీ.. హుజూరాబాద్​బై ఎలక్షన్​మాత్రం విచిత్రంగా మారింది. రోజు రోజుకూ ప్రచారపర్వం అక్కడి ప్రజలకు తిప్పలు తెచ్చి పెడుతోంది. ఒక దశలో ఓటర్లు.. నేతలపై కసురుకుంటున్నారు. సాగు పనుల సమయంలో పొలాల దగ్గరకు వెళ్లి ప్రచారం చేస్తుండటం మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. మూడు ప్రధాన పార్టీల నుంచి ఒకే రోజు, ఒకే పార్టీ తరుపున నాలుగైదు బృందాలు ఓటర్లను పలుకరిస్తున్నారు. ఓటర్ల దగ్గరకు వెళ్లి తమ పార్టీ, అభ్యర్థుల గురించి స్పీచ్ దంచుతున్నారు. దాదాపుగా రెండు నెలల నుంచి అవే మాటలు చెప్పుతుండటం, వద్దన్నా అక్కడే ఉంటూ స్పీచ్​ ఇవ్వడం హుజూరాబాద్​ప్రజల సహనానికి అగ్ని పరీక్షగా మారింది. దీంతో అసలు మాకు ఓటు హక్కు లేదంటూ తప్పించుకునే పరిస్థితి నెలకొంది. చాలా గ్రామాల్లో నేతల ప్రచారాన్ని తట్టుకోలేక తమ ఇండ్లకు ముందు తాళాలు వేసి, ఇంటెనక నుంచి రాకపోకలు సాగిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పీక్స్‎లో ప్రచారం..

హుజూరాబాద్​ఉప ఎన్నిక ప్రచారం పీ‌క్స్‌కు చేరింది. దీంతో ఇప్పుడు అసలు పరీక్ష ఓటర్ల సహనానికే ఎదురైంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారంలో దూకుడును కొనసాగిస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఆయా పార్టీల నుంచి నాలుగైదు బృందాలు తిష్ట వేశాయి. మొన్నటి వరకు టీఆర్‌ఎస్, బీజేపీ మాత్రమే ముందుండగా.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేరిపోయింది. ప్రతిష్టాత్మకమైన ఈ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీల నేతలు, అభ్యర్థులు ఒక్కో ఓటరుపైనా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. దీంతో సెగ్మెంట్​పరిధిలోని గ్రామాల్లో ఒక్కరు కనిపించినా ఓటును అడుక్కుంటున్నారు.

ఇద్దరు ఓటర్లు.. నాలుగైదు కార్లు..

ఈ నియోజకవర్గంలో ఖరీదైన కార్లు రోడ్లపై దౌడు తీస్తున్నాయి. ప్రతి గ్రామంలో నేతల కార్లతో కాన్వాయిని తలపిస్తోంది. రోడ్డు వెంట, పొలాల వెంట ఒక్క ఓటరు కనిపించినా ఒకరి వెనక ఒకరు పార్టీల నేతలు ఓటును అడుగుతున్నారు. ఓటు అడిగి వెళ్లడం కాదు.. తాము ఎంతో చేశామంటూ ఊకదంపుడు ప్రసంగాలను మొదలుపెడుతున్నారు. నలుగురు ఓటర్లు కనిపిస్తే అదో బహిరంగ సభ తరహాలోనే మాట్లాడుతున్నారు. దీంతో ఓటర్లు నేతల ముఖం మీదే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతా తెలుసు.. అంటూ వెళ్లిపొవాలంటూ సూచిస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో స్థానిక నేతలు వెంట రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. పొలాల దగ్గర ఇంకా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇద్దరు కూలీలు కనిపించినా చాలు.. నాలుగు కార్లు ఆగుతున్నాయి. అక్కడి ఓటర్ల కంటే ఓటును అభ్యర్థించే నేతలే ఎక్కువగా ఉంటున్నారు. దాదాపుగా మూడు నెలల నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నియోజకవర్గం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే ప్రచార పర్వాన్ని సాగిస్తూనే ఉన్నారు. ఓటర్లకు ఊపిరాడనివ్వకుండా ప్రచారం చేస్తున్న నేతలు.. ఇప్పుడు చివరి దశకు చేరిన నేపథ్యంలో మరింత దూకుడు పెంచారు. ఓటర్లను ఊపిరాడనివ్వకుండా రాజకీయ పార్టీల నాయకులు చంపుతున్నారంటూ గ్రామాల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అందులోనూ ఫొటోలు..

ఓ వైపు ఓట్ల కోసం అభ్యర్థనలు చేసుకుంటూనే.. తాము ఎంత గొప్పగా ప్రచారం చేశామనే అంశాన్ని నిరూపించుకునేందుకు ఓటర్లతో ఫొటోలు దిగడం సర్వసాధారణమైంది. వారితో మాట్లాడుతున్నట్లు ఫోజులివ్వడం, ఫొటోల కోసం ఓటర్లను అటూ ఇటూ తిప్పడం కూడా అసహనానికి దారి తీస్తోంది. ఇలా ప్రచారం చేసే ఫొటోలను నేతలు తమ అధిష్టానానికి, తమ ఇన్‌చార్జీలకు పంపించుకుంటున్నారు. ఇలా నేతల పబ్బం గడుస్తున్నా.. ఓటర్లకు మాత్రం కోపాన్ని తెస్తోంది.

ఫోన్లలోనూ అవే..

బహిరంగ ప్రచారం ఒకవైపు రచ్చ చేస్తుంటే.. పొద్దున లేచి ఫోన్ చూడాలంటే ఓటర్లు భయపడుతున్నారు. ఫోన్ కాల్స్ ద్వారా తమకు ఓటేయాలని అభ్యర్థుల అభ్యర్థనలు, ఆపై వాట్సాప్ మెసేజ్‌లు, నార్మల్ మెసేజ్‌లు ఇలా ఒకటేమిటి ఓటర్ల ప్రాణాలు ఓట్లకోసం తీస్తున్నారు. ఇటీవల కాలంలో విపరీతంగా వాట్సప్ మెసేజ్ ద్వారా తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న క్రమంలో వాట్సప్‌ను బంద్​చేస్తున్నామని పలు గ్రామాల్లో చెప్పుతున్నారు. ఓటర్ల ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా నేతలంతా సోది చెప్తుంటే తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఒక్కో ఓటర్‌ను రెండు, మూడు సార్లు చుట్టి రావాలనే లక్ష్యంతో ఉన్న నేతలు.. ఇతర జిల్లాల నుంచి చోటామోటా లీడర్లను కూడా పంపుతుండటంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

కాల్స్​ బ్లాక్..!

ఇక తమకే ఓటు వేయాలని పదే పదే ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో సదరు నెంబర్లను కూడా బ్లాక్ చేస్తున్నారు. రాత్రింబవళ్లు ఫోన్ కాల్స్​వస్తుండటంతో నెంబర్లను బ్లాక్​చేస్తున్నారు. ఇలా రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడా చోటుచేసుకోని చిత్రాలన్నీ హుజూరాబాద్​ఉప ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక ప్రచారం రాజకీయవర్గాలకు కీలకంగా మారగా, ఓటర్ల సహనానికి మాత్రం అసలు పరీక్షగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News