‘పెగాసస్ సీరియస్ ఇష్యూ కాదు’

న్యూఢిల్లీ: పార్లమెంటులో పెగాసస్ రచ్చ ఇంకా చల్లారలేదు. శుక్రవారమూ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ప్రతిపక్షాల నిరసనల మధ్యే సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇజ్రాయెలీ స్పైవేర్‌పై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం అది ముఖ్యమైన అంశం కాదని కొట్టేస్తున్నది. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, కానీ, విపక్షాలే సహకరించడం లేదని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చర్చ లేకుండా బిల్లులు పాస్ చేయాలని ప్రభుత్వమూ భావించట్లేదని, కానీ, […]

Update: 2021-07-30 11:44 GMT

న్యూఢిల్లీ: పార్లమెంటులో పెగాసస్ రచ్చ ఇంకా చల్లారలేదు. శుక్రవారమూ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ప్రతిపక్షాల నిరసనల మధ్యే సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇజ్రాయెలీ స్పైవేర్‌పై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం అది ముఖ్యమైన అంశం కాదని కొట్టేస్తున్నది. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, కానీ, విపక్షాలే సహకరించడం లేదని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చర్చ లేకుండా బిల్లులు పాస్ చేయాలని ప్రభుత్వమూ భావించట్లేదని, కానీ, ప్రతిపక్షాలే చర్చకు ప్రతికూలంగా ఉన్నాయని వివరించారు. లోక్‌సభలో మొత్తం 315 మంది సభ్యులు కొశ్చన్ అవర్ జరగాలని కోరుకుంటున్నారని, అయినప్పటికీ విపక్షాలు నిరసనలు వీడకపోవడం బాధాకరమని తెలిపారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి పెగాసస్‌పై సమగ్ర వివరాలను సభకు తెలిపారని గుర్తుచేశారు. పెగాసస్ అంశం ముఖ్యమైనదేమీ కాదని, దయచేసి చర్చకు సహకరించాలని విపక్షాలను కోరారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చ జరగాల్సి ఉన్నదని, వాటిపై దృష్టిపెట్టాలని తెలిపారు. విపక్షాలు మాత్రం స్పైవేర్‌పై చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశాయి.

ఉద్దేశపూర్వకంగానే చర్చించట్లేదు: ఖర్గే

ప్రభుత్వమే సమావేశం సజావుగా సాగనివ్వట్లేదని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ‘పెగాసస్ అంశం మీద చర్చించాలని అపోజిషన్ కోరుకుంటున్నది. దీనితోపాటు రైతులు, ధరల పెరుగుదల, మిజోరం-అసోం సరిహద్దు వివాదం, చైనా చొరబాటు సహా పలుఅంశాలపై చర్చలు జరగాలనుకుంటున్నాం. ప్రభుత్వం ఇలాంటి అంశాలపై చర్చను కోరుకోవడం లేదు. చర్చనే అనుమతించడం లేదు. పెగాసస్ దేశభద్రతకు సంబంధించిన అంశం. దీనిపై వచ్చిన ఆరోపణలు నేషనల్ సెక్యూరిటీపై ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇది ప్రజాస్వామిక దేశంలో ప్రజల స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్న విషయం’ అని అన్నారు.

ప్రైవేటైజేషన్ కోసమే ఆ బిల్లు

లోక్‌‌సభలో నిరసనల మధ్యే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ బిల్లు, జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్(నేషనలైజేషన్) సవరణ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి కేంద్రం వాటాను కోత పెట్టడానికి అనుమతించేలా చట్టానికి సవరణ చేసే జనరల్ ఇన్సూరెన్స్ బిల్లుపై ప్రతిపక్షాలు ఆగ్రహించాయి. బిల్లును ప్రవేశపెడుతూ ఇది ప్రైవేటీకరణకు దారి తీయదని, అవసరమైన వనరులను భారత మార్కెట్‌ల నుంచి సమకూర్చుకునే వెసులుబాటు కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ ఇది విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించి చివరికి ప్రభుత్వ సంస్థను పూర్తిగా ప్రైవేటీకరణకు వీలు కల్పిస్తుందని ఆరోపించాయి. విపక్షాల భయాలు అర్థరహితమని, భారత పౌరులు సంస్థలో భాగస్వాములవ్వడానికి కల్పించే బిల్లు అని కేంద్ర మంత్రి విపక్షాల వాదనలను తోసిపుచ్చారు. ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ క్యాపిటల్ 51శాతానికి తగ్గకుండా ఉండాలనే నిబంధనను బిల్లు తొలగిస్తుందని సవరణకు పేర్కొన్న కారణాలలో ప్రభుత్వం తెలిపింది.

44 నిమిషాల్లో 5 బిల్లులకు ఆమోదం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడిచినా చర్చ జరిగింది స్వల్పం. బిల్లుల ఆమోదమూ అంతంతే. ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్‌పై చర్చకు డిమాండ్ చేస్తు్న్న విపక్షాల నిరసనలతో ఉభయ సభల్లో వాయిదా పర్వమే కొనసాగుతున్నది. వర్షాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు లోక్‌సభలో కేవలం ఐదంటే ఐదే బిల్లు ఆమోదం పొందాయి. అవి కూడా ఆశించినంత చర్చ జరగకుండానే పాస్ అయ్యాయి. ఈ ఐదు బిల్లులపై సభలో కేవలం 44 నిమిషాలు మాత్రమే సభ్యులు సమయాన్ని వెచ్చించారు. అంటే సభ ప్రాడక్టివిటీ 14శాతంగా ఉన్నదని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ డేటా తెలుపుతున్నది. ఈ ఏడదిలోనే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఒక బిల్లుపై సగటున 2.5 గంటలు వెచ్చించడం గమనార్హం. రాజ్యసభలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నది. రాజ్యసభ మూడు బిల్లులను 72 నిమిషాలతో చర్చ తర్వాత ఆమోదించింది. దీని ప్రాడక్టివిటీ 22శాతంగా ఉన్నది.

Tags:    

Similar News