టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్ ఇస్తున్న పార్టీ నేతలు.. మీటింగ్‌కి డుమ్మా
దిశ, పరకాల: టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పార్టీ స్థానిక నేతలు షాక్ ఇస్తున్నారు. పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని కోరుతూ గత 25 రోజులుగా పరకాల ప్రజలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అమరవీరుల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పరకాలలోని వ్యాపార వాణిజ్య సంస్థలు తోపాటు, వివిధ రంగాల కార్మికులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం కూడా […]
దిశ, పరకాల: టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పార్టీ స్థానిక నేతలు షాక్ ఇస్తున్నారు. పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని కోరుతూ గత 25 రోజులుగా పరకాల ప్రజలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అమరవీరుల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పరకాలలోని వ్యాపార వాణిజ్య సంస్థలు తోపాటు, వివిధ రంగాల కార్మికులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దిన దినం ప్రజల్లో జిల్లా కాంక్ష బలపడుతోంది. అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతూ సంఘీభావ ర్యాలీలలో పాల్గొంటున్న విషయం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రోజురోజుకు పెరుగుతున్న ఉద్యమ ప్రభావం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి తలనొప్పిగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ ర్యాలీలకు పథక రచన చేశారు. అది ఆదిలోనే విమర్శలకు తావు ఇవ్వడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
స్థానిక టీఆర్ఎస్ నేతల నుంచి సైతం జిల్లా ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యేకు ఒత్తిడి పెరుగుతున్నట్లు వినికిడి. శుక్రవారం రోజు క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కావాలనే కొంతమంది నేతలు హాజరుకానట్లు తెలుస్తోంది. వీటన్నింటికి కారణం ఒకటే కొరకరాని కొయ్యలా తయారైన జిల్లా ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ఇలాగే చూస్తూ పోతే ఎమ్మెల్యే రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. దాంతో ఎమ్మెల్యే మరో పథకం రచనకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే శుక్రవారం పరకాల ఏసీపీ జె.శివరామయ్య వరంగల్ కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ ఆక్ట్ పేరుతో అమరవీరుల జిల్లా సాధన సమితి సభ్యులకు హెచ్చరికలు జారీ చేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు ఉద్యమం అణిచివేయడం కోసమే బదిలీపై పరకాలకు తీసుకువచ్చినట్లు పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు జిల్లా సాధనోద్యమకారులు సైతం కేసులు జైళ్లకు బెదిరేది లేదు అంటూ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో జిల్లా పోరు ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.