అధ్యక్షుడా? కన్వీనరా..? డిఫెన్స్‌లో కేడర్!

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీల నియామకంపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. జిల్లాకు అధ్యక్షుడితో కూడిన కమిటీని నియమించాలా? లేకుంటే కన్వీనర్‌ను మాత్రమే నియమించాలా? అనేది పరిశీలిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి ఆదరణ పెరుగుతుండటంతో దానికి అడ్డుకట్టవేసేందుకు వ్యూహాలను రచిస్తోంది. పార్టీలో జిల్లా కమిటీలతో నష్టం జరుగకుండా ఉండేందుకు కమిటీల కూర్పుపై ఆచితూచీ వ్యవహరిస్తోంది. అనుబంధ కమిటీలు, సోషల్ మీడియా కమిటీని సైతం నియమించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు టీఆర్ఎస్ జిల్లా కమిటీలను […]

Update: 2021-12-23 19:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీల నియామకంపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. జిల్లాకు అధ్యక్షుడితో కూడిన కమిటీని నియమించాలా? లేకుంటే కన్వీనర్‌ను మాత్రమే నియమించాలా? అనేది పరిశీలిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి ఆదరణ పెరుగుతుండటంతో దానికి అడ్డుకట్టవేసేందుకు వ్యూహాలను రచిస్తోంది. పార్టీలో జిల్లా కమిటీలతో నష్టం జరుగకుండా ఉండేందుకు కమిటీల కూర్పుపై ఆచితూచీ వ్యవహరిస్తోంది. అనుబంధ కమిటీలు, సోషల్ మీడియా కమిటీని సైతం నియమించనుంది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు టీఆర్ఎస్ జిల్లా కమిటీలను నియమించింది. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు కావస్తుండటంతో పాటు జిల్లా పునర్వీభజన జరిగింది. గతంలో నియమించిన జిల్లా అధ్యక్షుల పదవీకాలం ముగిసినా… వారినే ఇన్‌చార్జులుగా పార్టీ కొనసాగిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 2న నుంచి జెండా పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించి పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టింది. సెప్టెంబర్ చివరి వారం వరకు గ్రామ, మండల, పట్టణ కమిటీలతో పాటు జిల్లా కమిటీలు, డివిజన్ కమిటీలను నియమించాలని భావించింది. అయితే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కమిటీల నిర్మాణం జరుగలేదు. పార్టీలో అంతర్గత విభేదాలతో మండల, పట్టణంతో పాటు గ్రామకమిటీలు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లా, రాష్ట్ర కమిటీల నియామకంపై మాట్లాడటమే తప్ప వాటిపై సీరియస్‌గా దృష్టిసారించలేదు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీపై దృష్టిసారించింది. కానీ ఎప్పుడు ప్రకటిస్తారనేదానిపై మాత్రం స్పష్టత కరువైంది.

బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బలోపేతం అవుతుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆ పార్టీలో నూతనోత్తేజం వచ్చింది. అంతేగాకుండా యువతతో పాటు ప్రజల్లో బీజేపీకి ఆకర్షితులవుతున్నారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్‌లోని అసంతృప్తులు, ఉద్యమకారులను ఏకం చేసేందుకు బీజేపీ అడుగులు వేస్తుండటంతో టీఆర్ఎస్ అప్రమత్తమై జిల్లా కమిటీల నిర్మాణంపై దృష్టిసారించింది. టీఆర్ఎస్‌ను వీడకుండ ఉండేందుకు ప్రణాళికలు చేపట్టింది. అందులో భాగంగానే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. పార్టీలో పనిచేసేవారికి పదవులు ఇస్తామని అధినేత కేసీఆర్ హామీలు ఇచ్చారు. దీంతో పదవులను ఆశించిన నేతలు ఆలోచనలో పడి పార్టీని వీడాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడ్డారు. వేచిచూసేధోరణిలో ఉన్నామని… అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉండటంతో మరికొంతకాలం పదవుల కోసం ఎదురుచూస్తామని రాకుంటే పార్టీ మారుతామని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

గతంలో టీడీపీ జిల్లా కమిటీలు వేసింది. కమిటీలో చోటుదక్కని నేతలు తిరుగుబాటు ఎగురవేయడంతో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన టీఆర్ఎస్ అధిష్టానం పదేళ్లుకు పైగా ఇన్ చార్జులతోనే నెట్టుకొస్తుంది. ఈనెల 17న తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ అన్ని జిల్లాలకు కన్వీనర్లను నియమిస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు నూతన జిల్లా కమిటీల్లో చోటు దక్కుతుందని భావించిన నేతలకు నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. కన్వీనర్‌ను నియమిస్తే కార్యవర్గం ఉండదు. గతంలో జిల్లా కమిటీలను జంబోకమిటీలుగా ప్రకటించి అసంతృప్తులందరికీ అవకాశం కల్పించేవారు. అయితే ఈసారి ఆ అవకాశం ఉండకపోవడంతో నేతలు డిఫెన్స్‌లో పడినట్లయింది.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీకి రైతు, యువజన, విద్యార్థి, మహిళా, రైతు, బీసీ, లీగల్, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సెల్ కమిటీలతో పాటు సోషల్ మీడియా కమిటీ ఉంది. ఈ కమిటీలకు సైతం పదవీకాలం ముగిసింది. గత కమిటీ అధ్యక్షులనే కొనసాగిస్తుంది. వాటికిసైతం జిల్లా, రాష్ట్ర కమిటీలతో పాటు అనుబంధ కమిటీలకు పూర్తి స్థాయి కార్యవర్గం నియమిస్తారని భావించినప్పటికీ అధిష్టానం పెండింగ్‌లోనే పెట్టింది. నాలుగు నెలల క్రితం జిల్లా కమిటీల్లో పనిచేస్తున్న ప్రధానకార్యదర్శుల వివరాలను అధిష్టానం సేకరించింది. వారి పేర్లను సైతం పరిశీలించింది. నియమిస్తే కలిసివచ్చే సామాజిక వర్గాల వారీగా ఓట్ల వివరాలు, ఫీడ్ బ్యాక్ తీసుకుంది. జిల్లా, రాష్ట్ర కమిటీలను వారం రోజుల్లో నియమిస్తామని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఆ గడువు సైతం ముగిసింది. ఇంతకు కమిటీలను నియమిస్తారా? లేక? ఇన్ చార్జులను కొనసాగిస్తారా? అనేది మాత్రం సస్పెన్స్. ఏదీ ఏమైనప్పటికీ పార్టీ పదవులను ఆశిస్తున్న వారికి సైతం ఏళ్లుగా నిరాశ తప్పడం లేదు.

Tags:    

Similar News