మహబూబా, ఓమర్‌పై పీఎస్ఏ ప్రయోగం
జమ్ముకశ్మీర్‌లో గురువారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ, ఓమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి అలీ ముహ్మద్ సాగర్, పీడీపీ సీనియర్ నేత సర్తజ్ మదానిలపై ప్రజా భద్రతా చట్టం(పీఎస్ఏ) ప్రయోగించారు. ఈ చట్టం కారణంగా వారు మరికొంత కాలం గృహ నిర్భంధంలోనే ఉండాల్సిన పరిస్థితి. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులను విడుదల చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండు చేస్తున్న నేపథ్యంలో వారిపై పీఎస్ఏ […]
జమ్ముకశ్మీర్‌లో గురువారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ, ఓమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి అలీ ముహ్మద్ సాగర్, పీడీపీ సీనియర్ నేత సర్తజ్ మదానిలపై ప్రజా భద్రతా చట్టం(పీఎస్ఏ) ప్రయోగించారు. ఈ చట్టం కారణంగా వారు మరికొంత కాలం గృహ నిర్భంధంలోనే ఉండాల్సిన పరిస్థితి. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులను విడుదల చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండు చేస్తున్న నేపథ్యంలో వారిపై పీఎస్ఏ ప్రయోగించడం గమనార్హం. గురువారం సీనియర్ పోలీస్ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీవీర్ సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. మహబూబా ముఫ్తీ, ఓమర్ అబ్దుల్లాలను విడుదల చేస్తే శాంతికి విఘాతం కలుగుతుందని వారిపై ప్రజా భద్రతా చట్టం ప్రయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా మహబూబా ముఫ్తీ, ఓమర్ అబ్దుల్లాలు మరో మూడు నెలలు నిర్బంధంలోనే ఉండనున్నారు. ఇందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి, సంబంధిత ఉత్తర్వులపై జిల్లా మెజిస్ట్రేట్, శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ షాహిద్ ఇక్బాల్ సంతకం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాది ఆగస్టులో మాజీ సీఎం ఫారూఖ్ అబ్దుల్లాపై ఇదే చట్టం ప్రయోగించారు. అప్పటి నుంచి గప్కర్ రోడ్డులోని ఆయన ఇంట్లోనే నిర్బంధంలో ఉంచారు.
గత ఏడాది ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణలు 370, 35(ఏ)లను పార్లమెంట్ రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పుడే మాజీ సీఎంలు మహబూబా ముఫ్తీ, ఓమర్ అబ్దుల్లాలను భద్రతా బలగాలు గృహ నిర్బంధంలోకి తీసుకున్నాయి. వారిపై సీఆర్పీసీ సెక్షన్ 107 కింద కేసులు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా ఆరు నెలలకు మించి గృహ నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదు. దీంతో మహబూబా ముఫ్తీ, ఓమర్ అబ్దుల్లాలను విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే వారిపై పీఎస్ఏను ప్రయోగించారు. అంతకుముందే మహబూబా మేనమామ, పీడీఎఫ్ నేత సర్తజ్ మదాని, ఎన్సీపీ నేత అలీ ముహ్మద్ సాగర్‌లను ఎమ్మెల్యే హాస్టల్ నుంచి హౌస్‌కు తరలించారు. దాన్ని సబ్ జైలుగా మార్చారు.