పాలమూరులో కొత్త సమస్యలు

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పాలమూరులో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు క్రాస్ అయిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టెస్టులు తక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొదట్లో జోగులాంబ గద్వాల జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యేవి. కర్నూల్‌లో కేసులు సంఖ్య ఎక్కువగా […]

Update: 2020-08-25 20:37 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పాలమూరులో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు క్రాస్ అయిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టెస్టులు తక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొదట్లో జోగులాంబ గద్వాల జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యేవి. కర్నూల్‌లో కేసులు సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రభావం ఈ జిల్లాపై పడింది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఆరేంజ్ జోన్‌లో ఉండగా నారాయణపేట, వనపర్తి జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉండేవి. కానీ ప్రస్తుతం ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నారాయణ‌పేట మినహా మిగితా నాలుగు జిల్లాలు కరోనా కేసుల్లో పోటీపడుతుండటం ఆందోళన కలిగించే విషయం. ప్రతి రోజూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 400 కేసులు నమోదవుతుండటం గమనార్హం.

లాక్‌డౌన్‌కు ముందు కేసుల సంఖ్య అదుపులో ఉన్నా ప్రస్తుతం సడలింపు ఇవ్వడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రయాణాలు చేస్తూ తమ పనులు చేసుకుంటుండటంతో వైరస్ వ్యాప్తి పెరిగి కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జిల్లాలో సుమారు 168 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. టెస్టులు ఎక్కువ మొత్తంలో చేయకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రజలు సైతం సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతోంది.

హోం క్వారంటైన్‌లో ఉన్నవారితోనూ..

కరోనా సోకిన చాలా మందిని వైద్యులు ఇంట్లోనే హోం క్వారంటైన్ లో ఉండమని సూచిస్తున్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా చాలా మంది వైరస్ సోకిన వారిని ఇంట్లోనే ఉంచి మందులు అందిస్తున్నారు. వీరిలో కొందరు పూర్తిగా వైద్యం తీసుకోకుండా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. వైరస్ సోకిన వారిని గుర్తించి మొదటి రోజు వైద్యులు ఇంటికి వచ్చి వారికి మందులు అందించి చేతులు దులుపుకుంటున్నారు. తర్వాత వారి పరిస్థితిని అడిగే నాథుడే కరువవడంతో వైరస్ ప్రభావం పక్క వారి పైనా పడుతున్నది. అలాగే ఇంట్లో ఉండే వారు చికిత్స నుంచి కోలుకున్నారా? లేదా? అనే విషయం తెలియకుండానే 14 రోజుల క్వారంటైన్ పూర్తయిన తర్వాత వారు బయటకు వస్తున్నారు. వీరిలో కొంత మంది పూర్తిగా కోలుకోకుండానే బయటకు రావడంతో దీని ప్రభావం ఇతరుల‌పై పడుతోంది. ఇలా తెలియకుండానే కొందరు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు.

వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారిన పరిశ్రమలు..

జిల్లాలోని పరిశ్రమలకు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారుతున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 2,500 వివిధ రకాల పరిశ్రమలు తిరిగి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, షాద్‌ నగర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల పెద్ద పరిశ్రమల్లో వందల సంఖ్యలో కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేస్తుంటారు. వ్యాపార ఉత్పత్తుల‌పై చూపుతున్న శ్రద్ధ కార్మికుల భద్రత‌‌పై యాజమాన్యాలు చూపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా పరిశ్రమలల్లో శానిటైజేషన్ సరిగ్గా లేకపోవడంతో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఇటీవల ఓ రాజకీయ నాయకుడికి చెందిన పరిశ్రమలో సుమారు 90 శాతం మంది వైరస్ బారిన పడిన విషయం సైతం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. వీరందిని యాజమాన్యం హోం క్వారంటైన్ చేసి వైద్య సేవలు అందించారు. జడ్చర్లలో వైరస్ వ్యాప్తికి సెజ్ ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు. సెజ్‌లోని వివిధ పరిశ్రమల్లో పని చేసే చాలా మంది జడ్చర్ల పట్టణంలో నివాసముంటున్నారు. ఇలా పనిచేసే చాలా మందికి ఇప్పటికే వైరస్ సోకడం వల్లే జడ్చర్లలో సుమారు 400కేసులు నమోదు అయ్యాయని వారు చెబుతున్నారు.

పల్లెల్లోనూ..

మొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన వైరస్ క్రమంగా పల్లెల్లోకి సైతం వ్యాపించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి హైదరాబాద్ కు చాలా మంది తమ పనులు నిమిత్తం రాకపోకలు సాగిస్తున్నారు. అదే విధంగా గద్వాలకు సైతం కర్నూల్, రాయిచూర్ నుంచి చాలా మంది వచ్చిపోతుంటారు. ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించపోవడం వల్ల పాలమూరు జిల్లాలోని పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఇంట్లోనే ఉంటూ సొంత వైద్యం..

చాలా మంది తమకు వైరస్ సోకిందని ప్రాథమిక లక్షణాలతో గుర్తించినా బయటపడటం లేదు. ఈ విషయం ఇతరులకు తెలిస్తే తమను అంటరానివారిగా చూస్తారని భయపడుతున్నారు. ఇలా చాలా మంది ఇంట్లోనే ఉంటూ సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. వీరికి కొవిడ్ సోకిన విషయం తెలియకుండా ఇతరులు వీరిని కలిసినప్పుడు.. వారు సైతం వైరస్ బారిన పడుతున్నారు. మరికొంత మంది మాత్రం సాధారణ జలుబు, దగ్గు అనే భావనతో బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలో మరి కొంత మంది వైరస్ బారిన పడుతున్నారు.

Tags:    

Similar News