మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి: ఆశావహులు
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో మరోమారు పదువుల సందడి మొదలైంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ మరోమారు తెరమీదకు వచ్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో 338మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఈ 17 మున్సిపాలిటీల్లో 15 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్, మరో స్థానంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. మున్సిపల్ పాలకవర్గం కొలువుదీరిన 2 నెలల్లోనే కో ఆప్షన్ సభ్యుల […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో మరోమారు పదువుల సందడి మొదలైంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ మరోమారు తెరమీదకు వచ్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో 338మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఈ 17 మున్సిపాలిటీల్లో 15 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్, మరో స్థానంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. మున్సిపల్ పాలకవర్గం కొలువుదీరిన 2 నెలల్లోనే కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఆగష్టు చివరినాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో సందడి నెలకొంటోంది. గతంలో ప్రతి మున్సిపాలిటీలో ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ప్రస్తుతం ఈ సంఖ్య నాలుగుకు పెరిగింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో 68మంది కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలి. ప్రతి మున్సిపాలిటీలో ఇద్దరు ప్రత్యేక విషయ పరిజ్ఞన నిపుణులు, ఇద్దరు మైనార్టీ వర్గానికి చెందిన వారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. మైనార్టీ వర్గానికి చెందిన వారిలో ఒక్కరు కచ్చితంగా ఒక్క మహిళా వుండాలనే నిబంధన ఉంది. అలాగే ప్రత్యేక విషయ పరిజ్ఞన నిపుణుల విభాగంలో ఎంపిక చేసే వారు ఐదేండ్ల పాటు కౌన్సిలర్‌గా, సర్పంచ్, లేదా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవిలో వున్నవారు లేదా విశ్రాంత మున్సిపల్ ఉద్యోగి అయి ఉండాలనే నిబంధనలు పెట్టారు. ఒక్కటి కంటే ఎక్కువ ధరఖాస్తులు వచ్చినట్టయితే కౌన్సిలర్లు మూజువాణి ఓటు ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఆశించి విఫలమైన చాలా మంది టీఆర్ఎస్ శ్రేణులు కోఆప్షన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు సైతం పలువురికి కోఆప్షన్‌గా అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. అదే సమయంలో చాలా మంది ఇతర పార్టీల నాయకులను సైతం టీఆర్ఎస్‌లోకి చేర్చుకునేందుకు ఈ పదవులు ఇస్తామని ఆశ చూపారు. ప్రస్తుతం వీరంతా ఆయా నాయకుల చుట్టు తిరుగే పనిలో పడ్డారు. తమకు ఇచ్చిన మాట ప్రకారం కో-ఆప్షన్ సభ్యునిగా అవకాశం కల్పించాలని కొంత మంది కోరుతుండగా తాము చేసిన త్యాగానికి తగిన ప్రతిఫలం కల్పించాలని మరికొందరు కోరుతున్నారు.