ఈటల సూటి ప్రశ్న.. గులాబీ నేతలకు గుచ్చుకున్న ముల్లు
దిశ, వెబ్ డెస్క్: ఈటల రాజేందర్ వ్యవహారం గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. భూకబ్జా ఆరోపణలు రావడం, టీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు వ్యతిరేకంగా పావులు కదపడం, ఆయన ఢిల్లీ వెళ్లి రావడం, పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరతా అని ప్రకటించడం వరకూ అంతా ఉత్కంఠగా సాగింది. ఇదంతా ఒకెత్తైతే… శుక్రవారం ఈటల తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఒక ఎత్తు. ఈ మీడియా సమావేశంలో ఈటల […]
దిశ, వెబ్ డెస్క్: ఈటల రాజేందర్ వ్యవహారం గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. భూకబ్జా ఆరోపణలు రావడం, టీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు వ్యతిరేకంగా పావులు కదపడం, ఆయన ఢిల్లీ వెళ్లి రావడం, పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరతా అని ప్రకటించడం వరకూ అంతా ఉత్కంఠగా సాగింది. ఇదంతా ఒకెత్తైతే… శుక్రవారం ఈటల తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఒక ఎత్తు. ఈ మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ గులాబీ పెద్దలకు ఒక సూటి ప్రశ్న వేశారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
బడుగు, బలహీన వర్గాలకు టీఆర్ఎస్ లో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. “ప్రగతి భవన్ బానిస భవన్”గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ‘ప్రగతి భవన్ లో ఒక్క ఎస్సీ ఐఏఎస్ కానీ, ఒక్క ఎస్టీ ఐఏఎస్ కానీ, ఒక్క బీసీ ఐఏఎస్ కానీ కొలువులో ఉన్నారా’ అంటూ సూటి ప్రశ్న వేశారు. కాగా ఈటల ప్రెస్ మీట్ అనంతరం కారు నేతలు హుటాహుటిన మీడియా ముందుకొచ్చి ఈటలపై మాటల తూటాలు పేల్చారు కానీ… ఆ ప్రశ్నకు మాత్రం ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయారు.
ఎస్, ప్రగతి భవన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఐఏఎస్ లు ఉన్నారంటూ బల్లగుద్ది చెప్పలేదు. ఈటలపై విమర్శనాస్త్రాలు విసిరారు కానీ ఆ ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేకపోయారు. దీన్నిబట్టి చూస్తే నిజంగానే ప్రగతి భవన్ లో ఆ వర్గాలకు చెందిన ఐఏఎస్ అధికారులు లేరని స్పష్టం అవుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గులాబీ నేతలకు ఈటల విసిరిన ముల్లు గట్టిగానే గుచ్చుకుందని చర్చలు సాగుతున్నాయి.