కళ్లు చెమ్మగిల్లే కథనం : కాళేశ్వరం నిర్మాణం వెనక ఖాకీల త్యాగం
దిశ ప్రతినిధి, కరీంనగర్ : డాడీ అంటూ వచ్చి రాని మాటలతో కలవరిస్తున్న పసి పాప. ఈయన వెళ్లి పక్షం రోజులైనా ఇంటికి రాకపాయే.. అన్న మనోవేదనతోనే పసి హృదయాన్ని లాలిస్తున్న తల్లి. తన పొత్తిళ్లలో అట్టిపెట్టుకుంటే తండ్రి కోసం మరాం చేస్తున్న తన బిడ్డ.. మర్చిపోతుందన్న తాపత్రయంతో తల్లి పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. అంతలోనే మొబైల్ రింగ్ కావడంతో చెంగున వెళ్లి ఆతృతతో ఫోన్ లిఫ్ట్ చేసిందా తల్లి. నెమ్మదిగా అవతలి నుంచి […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : డాడీ అంటూ వచ్చి రాని మాటలతో కలవరిస్తున్న పసి పాప. ఈయన వెళ్లి పక్షం రోజులైనా ఇంటికి రాకపాయే.. అన్న మనోవేదనతోనే పసి హృదయాన్ని లాలిస్తున్న తల్లి. తన పొత్తిళ్లలో అట్టిపెట్టుకుంటే తండ్రి కోసం మరాం చేస్తున్న తన బిడ్డ.. మర్చిపోతుందన్న తాపత్రయంతో తల్లి పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. అంతలోనే మొబైల్ రింగ్ కావడంతో చెంగున వెళ్లి ఆతృతతో ఫోన్ లిఫ్ట్ చేసిందా తల్లి. నెమ్మదిగా అవతలి నుంచి మాట్లాడుతున్నాడు భర్త.. నేను బాగానే ఉన్నాను.. నువ్వు, బిడ్డ ఎలా ఉన్నారన్న యోగ క్షేమాలు తెలుసుకున్న వెంటనే ఫోన్ కట్ అయింది. ఎప్పుడొస్తారండి అన్న ప్రశ్న.. తన నోటి నుంచి రాకముందే ఫోన్ కట్ అయిపోయింది. మళ్లీ ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. మరో వైపున బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది. ఆ బిడ్డకేం తెలుసు తనకు స్పర్శ అందించేంత దగ్గరలో తండ్రి లేడని. మానసిక వేదనతో కళ్ల నుంచి ధారలుగా వస్తున్న కన్నీటిని కూడా తుడుచుకోలేకపోతున్న ఆ తల్లి.. భర్త కోసం ఆలోచిస్తూ బిడ్డ పక్కనే అలా కూర్చుండి పోయింది. ఈ పరిస్థితి ఏ ఒక్కరి ఇంట్లోనో కాదు.. వందల మంది పోలీసుల ఇళ్లలో దాదాపు ఐదేళ్ల పాటు సాక్షాత్కరించిన మౌన రోదన ఇది. కోడలా.. కొడుకు ఎప్పుడొస్తాడే.. అని అత్తామామలు ఫోన్ చేసి అడుగుతుంటే వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మానసిక సంఘర్షణతో కాలం వెళ్లదీసిన తల్లులెందరో.
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.. ఆ పల్లకి మోసే బోయిలెవ్వరు..? తాజ్ మహల్ నిర్మాణం కాదోయ్.. ఆ రాళ్లను మోసిన కూలీలెవ్వరూ..? అని మహాకవి శ్రీశ్రీ రాసిన కవిత వీరికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్టును డిజైన్ చేసిన ఇంజనీర్ల పాత్ర ఎంత కీలకమో.. వారిని కంటికి రెప్పలా కాపాడిన పోలీసులది అంతకన్నా కీలకమైన బాధ్యత అని చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజ్‌ల నిర్మాణం పూర్తయ్యే వరకూ పోలీసులు తమ ఇంటికన్నా ఎక్కవ సమయం వాటి రక్షణ కోసమే కేటాయించారు.
పొరుగునే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పట్టు సాధించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీసులు గోదావరి పరివాహక ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. మరో వైపున సాయుధ నక్సల్స్ అటువైపు రాకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకున్నారు. మావోయిస్టులు చొరబడితే మాత్రం ప్రాజెక్టు పూర్తి కాదని భావించిన ప్రభుత్వం కూడా పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో ఎక్కువగానే మోహరించేలా చేసింది. కేంద్ర పారామిలటరీ బలగాలే.. బేస్ క్యాంప్ వదిలి తాము ప్రాజెక్టుల వద్ద గస్తీ నిర్వహించేది లేదని తేల్చి చెప్పడంతో స్టేట్ సివిల్ పోలీసులే అక్కడ పకడ్బంధీగా బందోబస్తూ చేయాల్సి వచ్చింది.
లేఖలతో అలర్ట్..
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్లకు మావోయిస్టులు లేఖలు పంపించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సాంకేతిక నిపుణుల రక్షణ బాధ్యతలు కూడా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులే తీసుకోవాల్సి వచ్చింది. షార్ట్ వెపన్స్‌తో ఇంజనీర్లకు, నిర్మాణ కంపెనీ ప్రతినిధులకు గన్ మెన్లుగా వ్యవహరించారు. మహారాష్ట్ర వైపు ఉన్న లెఫ్ట్ బ్యాంక్ నిర్మాణ సమయంలో అయితే హద్దులు దాటి మరీ.. బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ పోలీసులు. మావోయిస్టులు దాడి చేస్తే ఎలా.. అన్న ఆందోళనతో అక్కడ డ్యూటీ చేసిన పోలీసులు కంటి నిండా నిద్ర పోకుండా, కడుపు నిండా తిండి లేకుండానే విధులు నిర్వర్తించారు. అన్నారం బ్యారేజ్ క్యాంప్‌లో గుర్తు తెలియని ఇద్దరు మహిళలు వచ్చి.. భోజనం చేసి వెళ్లారన్న సమాచారం అందగానే అక్కడి పోలీసులు ఆ ప్రాంతంలో చెట్టూ పుట్టా గాలించారు. అప్పటికే యాక్షన్ టీంలు ప్రాజెక్టే లక్ష్యంగా సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్నాయని సమాచారం అందుకోవడంతో మరింత అప్రమత్తం కావల్సి వచ్చింది.
ఓ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం సందర్శనకు వచ్చే ముందు రోజునే పొరుగునే ఉన్న జింగనూరు అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సీఎం కచ్చితంగా వచ్చి తీరుతారన్న సమాచారం అందుకున్న పోలీసులు మరింత కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు. పరిహారం అందించేందుకు అర్ధరాత్రి మంత్రులు వచ్చినప్పుడు తమకు తక్కువ పరిహారం ఇచ్చారంటూ నిర్వాసితులు ఆందోళన చేసినప్పుడు కూడా పోలీసులే రక్షణ వలయంగా ఏర్పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు ఎప్పుడు వచ్చినా వారిని క్షేమంగా సాగనంపే వరకూ అక్కడ డ్యూటీ చేసిన పోలీసులు నిద్రాహారాలు మాని మరీ విధులు నిర్వర్తించారు.
ప్రోత్సాహం నిల్..
దాదాపు ఐదేళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకూ ఇంటిని, ఒంటిని పట్టించుకోకుండా పనిచేసినా కనీసం రివార్డులకు కూడా పోలీసులు నోచుకోలేకపోయారు. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల నాడు జిల్లా కేంద్రాల్లో ఇచ్చే ప్రశంసా పత్రాలు తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిని గుర్తించలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ తాము పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలం మాత్రం రాలేదని అక్కడ డ్యూటీ చేసిన పోలీసులు నిరాశకు గురవుతున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన పోలీసులకు గతంలో అర్బన్ ఏరియాలో వారు కోరిన చోట పోస్టింగ్ ఇచ్చే విధానం అమలయ్యేది. కానీ, కాళేశ్వరం సెక్యూరిటీ విషయంలో అత్యంత కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులకు ఈ విషయంలోనూ అంతగా ప్రాధాన్యత కల్పించలేదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం రక్షణ విషయంలో పనిచేసిన తమకు ప్రోత్సాహకాలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపితే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం జలాలతో.. నీటి జలకళ సంతరించుకున్నా అక్కడ పనిచేసిన పోలీసుల వదనాల్లో మాత్రం వెలవెలనే మిగిలింది.