ఎన్ని లెటర్లు రాసినా స్పందించట్లే.. డబ్బులు ఇప్పించండి
దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ సరఫరా చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ జెన్‌కో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేశామని, రూ. 6,283 కోట్ల మేర బిల్లులు కూడా సమర్పించామని, సుమారు రూ. 3,441 కోట్లు బకాయిలతో పాటు 2017 జూన్ నాటికి రూ. 2,841 కోట్ల వడ్డీ కూడా చెల్లించాల్సి […]
దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ సరఫరా చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ జెన్‌కో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేశామని, రూ. 6,283 కోట్ల మేర బిల్లులు కూడా సమర్పించామని, సుమారు రూ. 3,441 కోట్లు బకాయిలతో పాటు 2017 జూన్ నాటికి రూ. 2,841 కోట్ల వడ్డీ కూడా చెల్లించాల్సి ఉన్నదని వివరించింది. ఈ బకాయిలను చెల్లించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి గతంలో చాలాసార్లు ఉత్తరాలు రాసినా స్పందన లేదని జెన్‌కో సీఎండీ శ్రీధర్ ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి తదపరి విచారణను అక్టోబరు 28కి వాయిదా వేసింది.
గతంలో సైతం ఈ బకాయిల గురించి తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి ఫలితం లేకపోవడంతో తెలంగాణ ట్రాన్స్‌కో సంస్థను దివాలా తీసిందని ప్రకటించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించింది. కానీ ప్రభుత్వరంగ సంస్థల దివాలా ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మేరకు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుని హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని జెన్‌కో పేర్కొన్నది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం తమకు బకాయి పడినప్పటికీ దానికి విరుద్ధంగా ఏపీకి చెందిన విద్యుత్ సంస్థలే చెల్లించాల్సి ఉన్నదనే వాదనను తెరపైకి తెచ్చినట్లు ఏపీ జెన్‌కో పేర్కొన్నది. విద్యుత్ డిస్కంలు సరఫరా చేసిన విద్యుత్ బిల్లులకు అనుగుణంగా చెల్లింపు చేయాల్సిన తెలంగాణ ప్రభుత్వం మరో విభాగానికి చెందిన బకాయిలను దీనికి ముడిపెట్టడం సమంజసం కాదని ఏపీ వాదించింది.
ఏపీ ప్రభుత్వంలోని ఏదేని ఒక విభాగం నుంచి తెలంగాణకు బకాయిలు రావాల్సి ఉంటే వాటి నుంచే రాబట్టుకోవాలి తప్ప ఏపీ జెన్‌కో బిల్లుల నుంచి సర్దుబాటు చేసుకునే విధానం సరైంది కాదని వాదించింది. తెలంగాణ నుంచి బకాయిలు రాకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు సంస్థలకు బిల్లులు చెల్లించడంలో ఏపీ జెన్‌కో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బిల్లుతోపాటు వడ్డీని కూడా చెల్లించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును ఏపీ జెన్‌కో కోరింది. తెలంగాణ ప్రభుత్వమే రూ. 3,441 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉన్నట్లు గతంలో ఒప్పుకున్నందున కనీసం ఆ మేరకైనా తొలి ప్రాధాన్యంగా చెల్లింపు చేసేలా ఆదేశించాలని, మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయాలని హైకోర్టును అభ్యర్థించింది.
ఈ పిటిషన్‌లోని అంశాలను, ఏపీ జెన్‌కో లేవనెత్తిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా టీఎస్ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్, విద్యుత్ సమన్వయ కమిటీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 28వ తేదీకి వాయిదా వేసింది.