ప్రీపెయిడ్ మీటర్లతో నష్టం తప్పదా..? భయపెడుతున్న కొత్త విద్యుత్ పాలసీ

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వానాకాల సమావేశాల్లో నూతన విద్యుత్ చట్టాలను ఆమోదించాలని పట్టుబడుతోంది. ఇందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేయగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముక్త కంఠంతో ఖండిస్తోంది. ప్రీపెయిడ్ మీటర్ల ద్వారా సామాన్యుల నడ్డి విరిచాలని కేంద్రం భావిస్తోందని విమర్శలు చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ అంశంపై ప్రభుత్వం, ఉద్యోగులు, ఆర్టీజన్లు, కార్మికుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్‌లో ఈ బిల్లు పాసయితే […]

Update: 2021-07-28 16:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వానాకాల సమావేశాల్లో నూతన విద్యుత్ చట్టాలను ఆమోదించాలని పట్టుబడుతోంది. ఇందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేయగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముక్త కంఠంతో ఖండిస్తోంది. ప్రీపెయిడ్ మీటర్ల ద్వారా సామాన్యుల నడ్డి విరిచాలని కేంద్రం భావిస్తోందని విమర్శలు చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ అంశంపై ప్రభుత్వం, ఉద్యోగులు, ఆర్టీజన్లు, కార్మికుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

పార్లమెంట్‌లో ఈ బిల్లు పాసయితే ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్, సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు 250 యూనిట్ల వరకు అందించే ఉచిత విద్యుత్ ను కూడా కోల్పోయే ప్రమాదముందని ప్రభుత్వం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఉద్యోగులు కూడా ఇదే వాదనను బలంగా వినిపిస్తున్నారు. అయితే కార్మికులు, ఆర్టీజన్లు మాత్రం తమ వేతనాలు పెరుగుతాయనే ఆశలో ఉన్నారు.

గుదిబండలా వ్యవసాయం

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నూతన విద్యుత్ చట్టం ద్వారా భవిష్యత్‌లో వ్యవసాయం గుదిబండలా మారే అవకాశముందని ఉద్యోగులు చెబుతున్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ప్రీపెయిడ్ మీటర్ల వల్ల ఊహించని విధంగా ఇబ్బందులు పడే సూచనలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వం అందించే విద్యుత్ సబ్సిడీ పథకాలన్నీ క్రమేపీ ఎత్తివేస్తే నిరుపేదలకు నష్టం తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతమున్న స్లాబ్ విధానం కూడా కోల్పోయే అవకాశముందంటున్నారు.

స్లాబ్‌ల విధానం ద్వారా నిరుపేదలకు చాలా తక్కువ మొత్తంలో కరెంట్ చార్జీలు వచ్చేవి. అయితే ఈ బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా అందరూ ఒకే స్లాబ్ పరిధిలోకి వచ్చే అవకాశముంది. దీంతో నిరుపేదలపై మరింత భారం పడే అవకాశముందని అంటున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందించే ఉచిత కరెంట్ పథకానికి కూడా గండిపడే అవకాశముంది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు చెబుతున్నారు.

ప్రైవేట్ పరమైతే ఇష్టారీతీన టారిఫ్‌లు

నూతన విద్యుత్ బిల్లు ఆమోదం పొందితే సంస్థలో పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీ భారీగా పెరిగిపోయే అవకాశముందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఇష్టారీతిన టారిఫ్‌లు పెంచే అవకాశాలుంటాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం గృహావసరాలు, వాణిజ్యపరమైన అవసరాలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలను నాలుగు భాగాలుగా విభజించి ప్రత్యేక టారిఫ్ విధానం అమలు చేస్తున్నారు. ప్రైవేటీకరణ జరిగితే భవిష్యత్‌లో ఈ స్లాబ్ విధానం మరుగునపడిపోతుంది. ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీజన్లు, కార్మికులకు తీరని అన్యాయం జరుగుతాయని వారు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉండగా పలు వర్గాలు మాత్రం ప్రైవేటీకరణ జరిగితే పలు కంపెనీలకు పోటీతత్వం పెరిగి టారిఫ్ తగ్గుతాయని అంటున్నాయి. ప్రైవేట్ పరం చేసినా ప్రస్తుతమున్న టారిఫ్ ప్రకారం సంస్థకు వచ్చే ఆదాయంలో నుంచి ఉద్యోగులకు వేతనాలు, నష్టాలు పూడ్చి నిర్వహణ చేపట్టడం కుదరదని, కాబట్టి ప్రైవేట్ పరం చేస్తే ప్రజలపై అదనపు భారం తప్పదని మరో వర్గం వాదన.

వేతనాలు పెరుగుతాయనే ఆశలో ఆర్టీజన్లు

నూతన విద్యుత్ చట్టం ఆమోదం పొందితే దానివల్ల వేతనాలు పెరిగే అవకాశముందని ఆర్టీజన్లు భావిస్తున్నారు. ఎలాగూ శ్రమించేది తామే కాబట్టి ప్రైవేటీకరణ చేస్తే ఆ ప్రైవేట్ సంస్థలు తమకు అధిక వేతనాలు కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీజన్ల సమస్యలు పరిష్కరించాల్సిన ఏఈలు, పైస్థాయిలో ఉన్న ఉద్యోగులు పట్టించుకోవడంలేదని, చిన్న సమస్యకు కూడా సీఎండీ వద్దకు వెళ్లాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా స్తంభాలు ఎక్కి మరీ శ్రమించడంతో వేతనాలు పెరుగుతాయంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ అవసరాల అనుగుణంగా పలు ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే డిమాండ్ తగ్గిన సమయంలో రాష్ట్రాల వద్ద సరిపడ విద్యుత్ ఉత్పత్తి ఉన్నా కచ్చితంగా కొనాల్సిందేననేది నిబంధనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా వానాకాలం, చలికాలంలో విద్యుత్ వినియోగం భారీగా పడిపోతుంది. ఆ సమయంలో రాష్ట్రాల వద్ద సరిపడ విద్యుత్ ఉత్పత్తి అయినా కూడా వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తింది.

లెక్కల్లేవు.. విద్యుత్ సంస్థల నష్టాలు

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తోంది. అయితే దీనికి సంబంధించిన లెక్కలేవీ సంస్థ వద్ద లేకపోవడంతోనే తీవ్రంగా నష్టాల్లో ఉన్నాయని పలువురు ఉద్యోగులు వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వం సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ డబ్బులు కూడా ఆలస్యమవుతోందని తద్వారా నష్టాలు చవిచూస్తున్నట్లు వారు చెబుతున్నారు. అంతేకాకుండా అధికారులు, డైరెక్టర్లు, సీఎండీలను ఇష్టారీతిన నియమించడం వల్ల సిబ్బంది గణనీయంగా తగ్గిపోయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రైవేట్ సంస్థల నుంచి ఎక్కువ రేట్లకు కరెంట్ కొనడం వల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోయినట్లు చెబుతున్నారు. ఉద్యోగులు, కార్మికుల వేతనాల పెంపు సైతం పద్ధతి ప్రకారం జరగడంలేదనే వాదన ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

నేడు దేశవ్యాప్తంగా నిరసనలు

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు తెచ్చి విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఖైరతాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, విశ్వేశ్వరయ్య భవన్ వద్ద నిరసనకు దిగనున్నట్లు సంఘం నేతలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు పాల్గొని ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను వివరించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కం ఉద్యోగులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రైతులు, నిరుపేదలకు నష్టం

నూతన విద్యుత్ బిల్లు అమలైతే రాష్ట్రంలోని రైతులంతా నష్టపోతారు. ప్రైవేట్ వ్యక్తులకు దయ, దాక్షిణ్యాలు ఉండవు. ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తారు. ప్రీపెయిడ్ మీటర్లతో ముందుగా డబ్బులు చెల్లించే సాగు చేసుకోవాలి. భవిష్యత్ లో రైతులకు వ్యవసాయం గుదిబండలా మారుతుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా నేలకొండపల్లి సెంటర్ నుంచి కొత్తూరు మీదుగా తిరుమలాయపాలెం సబ్ స్టేషన్ వరకు పాదయాత్ర నిర్వహించా. కేంద్రం ఈ బిల్లును విరమించుకోవాలి.
– కోటేశ్వర్ రావు, విద్యుత్ శాఖ ఏడీఈ

ప్రజలకు నష్టం కలిగించే బిల్లులు వద్దు

విద్యుత్ ప్రైవేటీకరణ అందరికీ ఇబ్బందిగా మారుతుంది. అంతటా ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తారు. దీనివల్ల నిరుపేదలకు ఇబ్బందులు తప్పవు. ఫోన్ రీచార్జి చేసుకున్నట్లుగా ముందస్తుగానే డబ్బులు చెల్లించాలి. అయితేనే కరెంట్. లేదంటే పవర్ ఉండదు. కేంద్రం ప్రజలకు, ప్రభుత్వ సంస్థలకు నష్టం కలిగించే బిల్లును ప్రవేశపెట్టకూడదు. పెద్దన్నగా సంస్థల బలోపేతానికి కృషి చేయాల్సిందిపోయి ఇలాంటి సంస్కరణలు చేయడం సరికాదు.
– నాగరాజ్, తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ వీడబ్ల్యూ 2871 వ్యవస్థాపక అధ్యక్షుడు

Tags:    

Similar News