నిధుల్లేవ్, జీతాల్లేవ్.. బోరుమంటున్న పంచాయతీలు
పంచాయతీలను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కోట్లు ఇస్తున్నామంటూ మాటలు చెప్పిన ప్రభుత్వం, నిధులు విడుదల చేసి ఫ్రీజింగ్లో పెడుతున్నది. దీంతో అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది పంచాయతీల పరిస్థితి. కనీసం పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు ఇచ్చుకోలేని దుస్థితికి చేరాయి. చిన్నపాటి అవసరాలకు చిల్లి గవ్వలేక పన్నులపైనే ఆధారపడాల్సి వస్తున్నది. పల్లె ప్రగతి కింద ఇచ్చిన ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. లేని పక్షంలో ట్రాక్టర్లను జప్తు చేస్తామని […]
పంచాయతీలను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కోట్లు ఇస్తున్నామంటూ మాటలు చెప్పిన ప్రభుత్వం, నిధులు విడుదల చేసి ఫ్రీజింగ్లో పెడుతున్నది. దీంతో అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది పంచాయతీల పరిస్థితి. కనీసం పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు ఇచ్చుకోలేని దుస్థితికి చేరాయి. చిన్నపాటి అవసరాలకు చిల్లి గవ్వలేక పన్నులపైనే ఆధారపడాల్సి వస్తున్నది. పల్లె ప్రగతి కింద ఇచ్చిన ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. లేని పక్షంలో ట్రాక్టర్లను జప్తు చేస్తామని హెచ్చరిస్తుండటం గమనార్హం.
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామ పంచాయతీలు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాయి. ప్రతినెలా కోట్లు ఇస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం మాటలకే పరిమితమవుతున్నది. ప్రతినెలా పల్లె ప్రగతిలో భాగంగా పంచాయతీలకు రూ. 339 కోట్లు విడుదల చేస్తున్నట్లు జీవోలు జారీ చేస్తున్నా… ఆ నిధులను ఫ్రీజింగ్లో పెడుతోంది. అంటే కేవలం కాగితాలపైనే నిధులు వస్తున్నాయి. ఒకవేళ ఖాతాల్లో నిధులు ఉన్నట్లు చూపిస్తున్నా. చెక్కులు పాస్ కావడం లేదు. ఫలితంగా మూడు నెలల నుంచి పంచాయతీల్లో పైసల్లేవ్. చిన్న చిన్న అవసరాలకూ రూపాయి ఇవ్వడం లేదు. చివరకు పంచాయతీ కార్యదర్శుల వేతనాలను కూడా రెండు నెలల నుంచి ఆపేసింది.
జనవరి నుంచి బ్రేక్..
రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా… వీటిలో చాలా పంచాయతీలు మైనర్వే. తండాలు, శివారు గ్రామాలు పంచాయతీలుగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అయితే వీటికి ఆదాయం ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడి ఉంటోంది. చిన్న పంచాయతీలు కావడం, పన్నుల వసూళ్లు అనుకున్నంత లేకపోవడం, వసూలు అవుతున్నా తక్కువగా ఉండటంతో ఎటూ సరిపోవడం లేదు. దీంతో ప్రభుత్వం ఇచ్చే పల్లె ప్రగతి ప్రణాళిక నిధులే దిక్కవుతున్నాయి. డిసెంబర్ నెల వరకు ఎలాగోలా నిధులు వచ్చినా, జనవరి నుంచి మొత్తం బ్రేక్ వేశారు. జనవరిలో కూడా పల్లె ప్రగతి ప్రణాళిక నిధులు ఇచ్చినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ నగదును మాత్రం ఇవ్వలేదు.
రూ. 1,300 కోట్లు పెండింగ్..
రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు సంబంధించి మార్చి మొదటి వారం వరకు రూ. 1300 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన చెక్కులన్నీ సిద్ధమై ట్రెజరీకి వెళ్లాయి. కానీ ట్రెజరీల నుంచి బయటకు రావడం లేదు. పంచాయతీల ఖాతాల్లో పల్లె ప్రగతి నిధులు కనిపిస్తున్నా వాటిని డ్రా చేసుకొనే అవకాశం లేదు. ప్రభుత్వం వాటిని ఫ్రీజ్ చేసింది. వీటితో పాటుగా ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, హరితహారం వంటి పనుల బిల్లులు కూడా ఆపేశారు. కొన్నిచోట్ల పనులు చేసిన సర్పంచ్లు వీటికోసం తిరుగుతూనే ఉన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాలు కూడా ఆపేశారు. వీరి వేతనాల బిల్లులు సమర్పించినా నిధుల్లేవంటూ ఆపేశారు. ఫలితంగా ఈ మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు.
ట్రాక్టర్లు గుంజుకుంటం..
పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసింది. కొన్ని ఉపాధి నిధులను సమకూర్చి కొన్నారు. వీటికి కొన్ని పంచాయతీలు నెలవారీగా, మరికొన్ని పంచాయతీలు మూడు నెలలకోసారి వాయిదాలను పెట్టుకున్నారు. అసలే ప్రభుత్వంతో వ్యవహారం కావడంతో బ్యాంకర్లు కూడా వాయిదాలను తగ్గించి ప్రతినెలా ఎక్కువ కిస్తీని పెట్టుకున్నారు. దీంతో కొన్ని పంచాయతీలు ట్రాక్టర్లకు నెలకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు చెల్లిస్తున్నాయి. డిసెంబర్ వరకు ఎంతో కొంత మేరకు వాయిదాలు చెల్లిస్తున్నా జనవరి నుంచి ఆగిపోయాయి. ట్రాక్టర్ల నెలవారీ చెక్కులను కూడా నిలిపివేశారు. వాస్తవంగా ఇది గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల మెడకు చుట్టుకుంటున్నది. ఎందుకంటే వారిద్దరిపైనే వాయిదాలు ఉంటున్నాయి. ఇప్పుడు వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు కూడా వారినే అడుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్ల నెలవారీ కిస్తీలు చెల్లించడం లేదంటూ నోటీసులు జారీ చేశారు.
నిధులు చాలటం లేదు..
మరోవైపు పల్లె ప్రగతి కింద కోట్లు ఇస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం… 2011 జనాభా లెక్కల ఆధారంగానే విడుదల చేస్తోంది. ప్రస్తుతం జనాభా పెరిగింది. కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఇచ్చే నిధులు ఎటూ సరిపోవడం లేదు. పంచాయతీ కార్మికులకు వేతనాలు కూడా పెంచారు. రూ. 8,500 చొప్పున ఇస్తున్నారు. దీంతో వస్తున్న సొమ్మంతా ట్రాక్టర్ల ఈఎంఐలు, కరెంట్ బిల్లులకు ఎక్కువ శాతం పోతుండగా కొన్ని పంచాయతీల్లో వేతనాలకు మళ్లీ పన్నులపై ఆధారపడాల్సి వస్తున్నది. 2011 జనాభా ఆధారంగా నిధులి స్తుండడంతో ఇప్పటి అవసరాలకు అవి ఏమాత్రం సరిపోవటం లేదు.