మైకంలో మైనింగ్ అధికారులు.. ప్రాణాలు పోతున్నా పట్టింపేది..?

దిశ, కొత్తగూడెం: అధికార పార్టీ అండ.. అధికారుల ఉదాసీనత అక్రమార్కులకు వరంగా మారగా.. కార్మికులకు ప్రాణ సంకటంగా మారింది. అనుమతులు గోరంతా.. తవ్వకాలు కొండంతా అన్నట్లు క్వారీల యజమానులు అక్రమాలకు తెరలేపారు. మరికొందరు ఏకంగా ప్రభుత్వ భూముల్లోనే అక్రమంగా క్వారీలను ఏర్పాటు చేసి లక్షల సొమ్మును మూటకట్టుకుంటున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఈ దందా జోరుగా జరుగుతోంది. అను‘మతి’ ఉండదా..? పాల్వంచ మండలం తొగూడెం గ్రామంలో […]

Update: 2021-09-28 07:05 GMT

దిశ, కొత్తగూడెం: అధికార పార్టీ అండ.. అధికారుల ఉదాసీనత అక్రమార్కులకు వరంగా మారగా.. కార్మికులకు ప్రాణ సంకటంగా మారింది. అనుమతులు గోరంతా.. తవ్వకాలు కొండంతా అన్నట్లు క్వారీల యజమానులు అక్రమాలకు తెరలేపారు. మరికొందరు ఏకంగా ప్రభుత్వ భూముల్లోనే అక్రమంగా క్వారీలను ఏర్పాటు చేసి లక్షల సొమ్మును మూటకట్టుకుంటున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఈ దందా జోరుగా జరుగుతోంది.

అను‘మతి’ ఉండదా..?

పాల్వంచ మండలం తొగూడెం గ్రామంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఇక్కడ ఒక్క దగ్గరే కాకుండా జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల అనుమతులు లేకుండా క్వారీలు నడుస్తున్నట్లు ప్రజాసంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కొన్నిటికి తాత్కాలిక పర్మిట్లు తీసుకువచ్చి పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమంగా రెవెన్యూ, అటవీ భూములు కబ్జా చేసి ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. మరోవైపు క్వారీలల్లో అర్ధరాత్రి బాంబు బ్లాస్టింగ్‌లు చేస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ బాంబు బ్లాస్టింగ్‌లపై స్థానికులు అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ఆ మరణాలపై అన్నీ అనుమానాలే..

ఇటీవల క్వారీలలో పనిచేస్తున్న కార్మికులు మూడు చోట్ల వరుసగా మృతిచెందారు. అయితే వారి మరణాలపై అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగానే రెండు నెలల క్రితం మరో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. అది మరువకముందే 4 రోజుల క్రితం క్వారీలో పనిచేస్తున్న మరో వ్యక్తి చనిపోయాడు. ఇవన్నీ ప్రమాదవశాత్తు మరణాలా లేక మరే ఇతర కారణాలైన ఉన్నాయా అనే అనుమానాలు పాల్వంచ వాసులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

అధికారులు స్పందించకపోవడాకి కారణం అదేనా..?

ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది జిల్లా ప్రజల మెదడును తొలుస్తున్న ప్రశ్న. అయితే ప్రజాసంఘాల నాయకులు మాత్రం.. క్వారీల నిర్వాహకులకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని, అధికారులు కూడా అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. కళ్ల ముందు పరిమితికి మించి తవ్వకాలు చేస్తున్నా శాఖాపరమైన చర్యలకు మైనింగ్ అధికారులు వెనకడుగు వేయడంపై మండల ప్రజలు విస్తుపోతున్నారు. అయితే క్యారీల అక్రమాలపై అధికారులను వివరణ కోరేందుకు ‘దిశ’ ప్రయత్నించినా.. వాళ్లు స్పందించలేదు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ అక్రమ మైనింగ్ పై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News