వ్యాపార సంస్థగా ‘నిమ్స్’.. పేషెంట్లకు కొత్త చిక్కులు!

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన నిమ్స్ ఆసుపత్రి వ్యాపార సంస్థగా మారుతోందనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. యాజమాన్యానికి ఉన్న వెసులుబాటును వినియోగించుకొని అవకాశం ఉన్న చోట వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఓపీ (ఔట్ పేషెంట్), టెస్టింగ్ ప్రక్రియలను ఆధాయం దండుకునే మార్గాలుగా ఎంపిక చేసుకుంటున్నారు. వాస్తవానికి నిమ్స్ ఆసుపత్రిలో ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఓపీ సేవలు కొరకు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ […]

Update: 2021-08-14 18:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన నిమ్స్ ఆసుపత్రి వ్యాపార సంస్థగా మారుతోందనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. యాజమాన్యానికి ఉన్న వెసులుబాటును వినియోగించుకొని అవకాశం ఉన్న చోట వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఓపీ (ఔట్ పేషెంట్), టెస్టింగ్ ప్రక్రియలను ఆధాయం దండుకునే మార్గాలుగా ఎంపిక చేసుకుంటున్నారు.

వాస్తవానికి నిమ్స్ ఆసుపత్రిలో ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఓపీ సేవలు కొరకు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలో ఓపీ ఎంట్రీకి రూ.100 ఛార్జీ తీసుకుంటారు. తర్వాత 4 నుంచి 7 గంటల వరకు సాయంత్రపు ఓపీ జరుగుతుంది. ఈ సమయంలో సేవలు పొందేందుకు వివరాలు నమోదుకు ఏకంగా రూ.500 చార్జీ వసూల్ చేస్తున్నారు. అంటే ఉదయం ఓపీ కంటే సాయంత్రపు ఔట్ పేషెంట్ నమోదు ప్రక్రియకు ఐదు రెట్లు పెంచారు. అయితే ఉదయం ఓపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, సాయంత్రం ఓపీ డాక్టర్లు, కొందరి అధికారుల సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే ఈ సమయంలో ఓపీ సేవలు పొందితే అత్యధికంగా చార్జీలు తీసుకుంటున్నారని స్వయంగా నిమ్స్ లో పనిచేసే సిబ్బంది పేర్కొనడం గమనార్హం.

ఇక టెస్టుల విషయంలో కూడా అధిక రేట్లు తీసుకుంటున్నారు. నిమ్స్‌లో బయటి ల్యాబ్స్ కంటే 35 శాతం తక్కువ ధరలు ఉంటాయనే ప్రచారం ఉంది. కానీ ఈ ధరలు ఉదయపు ఓపీలో మాత్రమే వర్తిస్తున్నాయి. సాయంత్రపు ఓపీలో మాత్రం బయట ల్యాబ్స్ తీసుకునే చార్జీలనే వసూలు చేస్తున్నట్లు నిజామాబాద్‌కు చెందిన రమేష్ తెలిపారు.

పది తర్వాత సర్వర్లు డౌన్..

ప్రతీ వారంలో రెండు సార్లు సర్వర్లు డౌన్ అంటూ నిమ్స్ స్టాఫ్ ఉదయం ఓపీ నమోదు ప్రక్రియకు ఆటంకం కలిగిస్తారు. 8 నుంచి 10 వరకు ఓపీ స్లిప్‌లు ఇచ్చి, ఆ తర్వాత కంప్యూటర్లు పనిచేయడం లేదని, కరెంట్ పోయిందని మరి కొంతసేపు కాలాన్ని దాటవేస్తారు. తీరా 11.30 రాగానే ఓపీ కౌంటర్లు క్లోజ్ అని తేల్చి చెప్తారు. ఉదయం నుంచి లైన్లలో నిలబడి ఉన్న రోగులను తిరిగి మరుసటి రోజు రమ్మంటారు. లేదా సాయంత్రపు ఓపీకి రావాలని ఓపీ కౌంటర్ సిబ్బంది సూచిస్తారు. అయితే అప్పటికే విభాగాలు ఖాళీగా ఉండి డాక్టర్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఓపీ స్లిప్ లు ఇవ్వరు. పేషెంట్లు డాక్టర్లను సంప్రదించినా.. నిబంధనల ప్రకారం ఓపీ స్లిప్ లేనిదే తాము ట్రీట్మెంట్ చేయలేమని తేల్చి చెప్తారు. దీంతో చేసేదేమీ లేక చాలా మంది రోగులు సాయంత్రపు ఓపీలకు వెళ్లాల్సి వస్తుంది. తద్వారా నిమ్స్ నిర్వాహకులు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పాత రోగులకు తప్పని చిక్కులు..

నిమ్స్ దవాఖానలో ఏదేని విభాగంలోని డాక్టర్‌ను సంప్రదించాలంటే ఓపీ స్లిప్ తప్పనిసరి. కొత్త రోగులతో పాటు రివ్యూ పేషెంట్లకు ఈ నమోదు ప్రక్రియ లేనిచో వైద్యాన్ని తిరస్కరిస్తారు. అంతేగాక టెస్టులు, స్కానింగ్ లు చేయించుకోవాలన్నా ఓపీలో నమోదైతేనే శాంపిల్స్ సేకరిస్తారు. దీంతో రెగ్యూలర్ రివ్యూకు వచ్చిన పేషెంట్లకు కూడా సకాలంలో ఓపీ స్లిప్ అందక కూడా తీవ్ర ఇబ్బదులు పడుతున్నారు.

జిల్లాల నుంచి వచ్చే పేషెంట్లకు తీవ్ర ఇబ్బందులు

నిమ్స్‌లో బెటర్ ట్రీట్మెంట్ లభిస్తుందని వివిధ జిల్లాల నుంచి వచ్చే పేషెంట్లకు ఓపీ బ్రేక్‌లతో తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి. ఉదయం నుంచి లైన్లో నిలబడిన తర్వాత కూడా ఓపీ స్లిప్ లభించకపోతే వారు మరుసటి రోజు వరకు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. కొందరు సాయంత్రపు ఓపీలో సేవలు పొందుతున్నప్పటికీ, ఆర్థిక సమస్యలున్నోళ్లు తర్వాత రోజు వరకు నిమ్స్‌లోనే స్టే చేస్తున్నారు. పేషెంట్ అటెంటర్స్ కోసం ఏర్పాటు చేసిన షెడ్లు, చెట్ల కింద, మిలీనియం బ్లాక్ హాల్, క్యాంటీన్ తదితర చోట తలదాచుకుంటున్నారు. ఇక మహిళలు, వృద్ధులైతే నరకయాతన పడాల్సి వస్తుంది.

ఉదయం నుంచి లైన్లో నిలబడిన ఓపీ స్లిప్ దొరకలేదు

ఎండోక్రైనాలజీ విభాగాన్ని సంప్రదించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాను. శనివారం ఉదయం 9.30 నుంచి లైన్లో నిలబడ్డా. కానీ సర్వర్లు డౌన్ అంటూ, కరెంట్ పోయిందని 11.30 వరకు ఓపీ స్లిప్ ఇవ్వలేదు. తర్వాత ఓపీ కౌంటర్లు క్లోజ్ చేశారు. చేసేదేమీ లేక సోమవారం మరోసారి రావాలని నిర్ణయించుకున్నాను.
-చంటిబాబు, భద్రాద్రి కొత్తగూడెం

Tags:    

Similar News