పత్తిమిల్లు కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్?
దిశ ప్రతినిధి, కరీంనగర్: కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సరికొత్త ఇన్వెస్టిగేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ విచారణ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు నెలల పాటు కొనసా….గుతూనే ఉంది. ఇంతకాలంగా పోలీసులు విచారణ చేస్తూ కాలయాపన చేయడానికి కారణాలు ఏంటీ..? అసలు ఏం జరుగుతోంది..? వెనకున్న వారెవరు అన్నదే ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ కాటన్ జిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సరికొత్త ఇన్వెస్టిగేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ విచారణ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు నెలల పాటు కొనసా….గుతూనే ఉంది. ఇంతకాలంగా పోలీసులు విచారణ చేస్తూ కాలయాపన చేయడానికి కారణాలు ఏంటీ..? అసలు ఏం జరుగుతోంది..? వెనకున్న వారెవరు అన్నదే ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ కాటన్ జిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ కిడ్నాప్ కు గురయ్యారు. ఈ విషయంపై బాధితులు జనవరి 29న పోలీసులకు ఫిర్యాదు చేయగా మే మొదటి వారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే పోలీసులు మాత్రం జనవరి 29 నుండి కిడ్నాప్ కారణాలపై దర్యాప్తు మాత్రం చేస్తూనే ఉన్నారు. కిడ్నాప్ చేయడానికి కారణాలు ఏంటీ అన్న విషయంపై ఆరా తీస్తున్న పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. కాటన్ మిల్లలు కొనుగోలు చేసిన పత్తి దారి మళ్లిందని, దీంతో కంప్యూటర్ ఆపరేటర్ ను తమవెంట తీసుకెళ్లి ఆరా తీశామని సదరు మిల్లు యజమాని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కిడ్నాప్ వ్యవహారాన్ని హోల్డ్ లో పెట్టిన పోలీసులు పత్తి దొంగతనంపై దృష్టి సారించారు.
మిల్లులో రూ. 3.5 కోట్ల నష్టం వాటిల్లిందని అందులో పనిచేసే సిబ్బంది, ట్రేడర్స్ సహా 14 మందిపై మిల్లు యాజమాన్యం మరో ఫిర్యాదు చేసింది. ఆ తరువాత దాదాపు రెండు నెలల పాటు ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఆపరేటర్లు, వారి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలు కూడా తనిఖీ చేశారు. చివరకు ట్రేడర్స్ ను కూడా విచారించిండంతో పోలీసులు విస్తూపోయే నిజాలను గుర్తించారు. మిల్లులో 5 వేల టన్నుల పత్తి షాటేజ్ వచ్చిందని దీని విలువ రూ. 3.5 నుండి 4 కోట్ల మేర ఉంటుందని భావిస్తున్నారు.
కాటాన్ మిస్సింగ్ వాస్తవమేనా..?
మిల్లు యజమాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండేళ్లుగా పత్తి అక్రమంగా దారి మళ్లించారని యజమాని పోలీసులకు తెలిపినట్టు సమాచారం. అయితే పత్తి కొనుగోలు చేసే పక్రియలో జరిగిన తప్పిదాలే ఇంతదూరం తెచ్చాయా లేక తప్పుడు ఫిర్యాదు ఇచ్చారా అన్న విషయం తేలాల్సి ఉన్నప్పటికీ పోలీసుల విచారణ అంతా మిల్లులో పనిచేసిన చిరు ఉద్యోగులు, ట్రేడర్స్, రైతులే లక్ష్యంగా సాగుతుండడం విస్మయం కల్గిస్తోంది. వాస్తవంగా పత్తి కొనుగోలు చేయాలంటే యజమాని, సీసీఐ, మార్కెటింగ్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే సాగాల్సి ఉంటుంది.
అంతేకాకుండా పత్తి లావాదేవీలకు సంబంధించిన వివరాలను సీసీఐ అధికారులు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తుంటారు. అప్ లోడ్ కు సంబంధించిన వివరాలను పొందుపర్చేందుకు ప్రత్యేకంగా పాస్ వర్డ్ కూడా ఉంటుంది. ఈ లాగిన్ పాస్ వర్డ్ సీసీఐ అధికారుల నుండి మిల్లులో పనిచేస్తున్న వారికి ఎలా తెలిసింది అన్నదే మిస్టరీగా మారింది. మిల్లులో పత్తి కొనుగోలుకు సంబంధించిన వివరాలను మిల్లు యజమాని ఇచ్చిన ఫిర్యాదుతోనే పోలీసులు నిర్దారణకు రాకుండా సీసీఐ, మార్కెటింగ్ విభాగాల నుండి కూడా సేకరిస్తే వాస్తవాలు తెలిసేవి కదా అన్న చర్చ కూడా మొదలైంది.
భూపాలపల్లి జిల్లాలో మూడు జిన్నింగ్ మిల్లులు ఉండగా వాటిల్లో కొనుగోలు చేసిన పత్తి ఎంత, వాటి ద్వారా సీసీఐ సేకరించిన పత్తి ఎంత అన్న వివరాలు తెలుసుకుని, వ్యవసాయ శాఖలో జిల్లాలో పత్తి విస్తీర్ణం తెలుసుకుంటే నిజాలు తెలిసేవి. ఎకరా భూమిలో సగటును 12 క్వింటాళ్ల పత్తి పండుతుందన్న అంచనా ప్రకారం జిల్లాలో ఎంత మేర విస్తీర్ణంలో పత్తి సాగయిందో గణాంకాలు తీసుకుంటే సరిపోతుంది కదా అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే మిల్లు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీఐ, మార్కెట్ అధికారుల వాంగ్మూలాలను తీసుకుంటే క్లారిటీ వచ్చేది కానీ వీరు గ్రౌండ్ లెవల్లో ఉన్న వారినే లక్ష్యంగా చేసుకుని ఆరా తీస్తుండడం విస్మయం కల్గిస్తోంది. అయితే పోలీసు విచారణలో కేవలం 150 క్వింటాళ్ల మేర పత్తి మాత్రమే దారి మళ్లిందని గుర్తించిన పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నుండి కొంత డబ్బు రికవరీ చేసినట్టుగా సమాచారం.
బాసుకు ఫిర్యాదు…
మిల్లులో అక్రమంగా పత్తి దారి మళ్లిందన్న విషయంలో తనకు న్యాయం జరగలేదంటూ యజమాని నార్త్ జోన్ ఐజీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు దర్యాప్తు మళ్లీ మొదటికొచ్చింది. పోలీసులు మళ్లీ విచారణ చేపట్టేందుకు ముందుకు వచ్చి సెకండ్ ఎంక్వైరీలో కూడా మిల్లులో పనిచేస్తున్న ఉద్యోగులను, ట్రేడర్స్ ను, రైతులనే పిలిపించి విచారణ చేస్తున్నారు. రైతులు ఎంత మేర పత్తి అమ్మారు, ట్రేడర్స్ సప్లై చేసిన పత్తి ఎంత? ఉద్యోగులు దారి మళ్లించిన పత్తి ఎంత అన్న వివరాలపై మళ్లీ దృష్టి సారించారు. చివరకు ట్రేడర్స్ పత్తి లావాదేవీల్లో క్వింటాళుకు రూ. 300 చొప్పున తీసుకున్నామని చెప్పగా వారు తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించాలని పోలీసులు సూచించినట్టుగా సమాచారం.
రెండేళ్లుగా మిల్లులో పత్తి మాయం అయిందని చెప్తున్న సదరు మిల్లు యజమాని గత సంవత్సరం సీసీఐకి అందించిన ఎక్స్ ఎల్ షీట్లు, ఇతరాత్ర రికార్డులను పరిశీలించాల్సి ఉంది. ఒకవేళ గత సంవత్సరమే కొనుగోలు చేసిన పత్తికి, సీసీఐకి సరఫరా చేసిన పత్తి పరిమాణానికి తేడా ఉన్నట్టుగా ఎందుకు గుర్తించలేకపోయారు. ఈ గణాంకాల్లో తేడా వస్తే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది.
54 రోజుల్లోనే….
పత్తి చోరీకి గురైందన్న మిల్లు వాస్తవంగా 54 రోజులే నడిచినట్టు తెలుస్తోంది. మిల్లు సామర్థ్యాన్ని బట్టి 54 రోజుల్లో ఎన్ని టన్నుల పత్తి జిన్నింగ్ చేయవచ్చు, ఇందుకు ఎంత మేర కరెంటు వినియోగం అవుతోంది అన్న సాంకేతిక పరమైన వివరాలను సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల అసలు మిల్లు యజమాని ఇచ్చిన ఫిర్యాదు తప్పా లేక అందులో పనిచేస్తున్న చిరుద్యోగులది తప్పా అన్నది స్పష్టం అవుతుంది. కానీ శాస్త్రీయ విధానాలను పక్కకు పెట్టి విచారణను అంత వెనక్కి జరుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ పత్తి ఎలా వచ్చిందో..?
సీసీఐ కౌంటర్ ఏర్పాటు చేసిన మిల్లులో పత్తి విక్రయించేందుకు రైతులు సాధారణంగా గూడ్స్ వాహనాలను ఉపయోగిస్తారు. అయితే ఏ వాహనంలో మిల్లుకు పత్తి చేరింది, దాని నెంబరు, అందులో రవాణా అయిన పత్తి ఎంత అన్న వివరాలు కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. పత్తి రవాణా చేసిన వాహనాల వివరాలను కూడా ఆధారం చేసుకుని పోలీసులు విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా సీసీఐ నిబంధనల ప్రకారం శని, ఆదివారాలు సెలవు దినాలు. ఈ రెండు రోజులూ పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ సెలవు దినాల్లో కూడా లావాదేవీలు జరిగినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. నిబంధనలకు విరుద్దంగా మిల్లు యజమాని పత్తిని కొనుగోలు చేయడంపై సీసీఐ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని స్పష్టం అవుతోంది.
వాస్తవం వెలుగులోకి రాకూడదనేనా..?
అయితే ఈ కేసులో పోలీసుల విచారణను దారి మళ్లించడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. మిల్లులో జరిగిన పత్తి దొంగతనం కేసుకు అందులో పనిచేసే ఉద్యోగులు, ట్రేడర్స్ పై అనుమానాలు వ్యక్తం చేయడం వల్ల తనుకు లాభిస్తుందని యజమాని భావించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ కొంతమంది ట్రేడర్స్ కు కమిషన్ ఇవ్వాల్సి ఉన్నందున వాటిని తప్పించుకోవడంతో పాటు వారి నుండే తనకు డబ్బులు ఇప్పిస్తారన్న యోచనతోనే తప్పుడు ఫిర్యాదు చేశారంటున్నారు స్థానికులు. వాస్తవంగా పత్తి పండించని రైతుల నుండి కూడా కొనుగోలు చేసినట్టుగా రికార్డులు రాసి తక్కువ పత్తిని సరఫరా చేసి ఎక్కువ పరిమాణంలో పత్తిని సీసీఐకి పంపించినట్టు చూపించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహరాంలో రూ. కోట్లు చేతులు మారిన గుట్టు వెలుగులోకి వస్తుందన్న యోచనతోనే పోలీసుల దృష్టిని చిరుద్యోగులు, ట్రేడర్స్ పైకి మళ్లించారన్న విమర్శలు ఉన్నాయి.