కరోనా.. పర్యావరణానికి మేలు చేసిందా?
దిశ వెబ్ డెస్క్: ప్రపంచమంతా కరోనా వైరస్ (కోవిడ్-19) భయంతో వణికిపోతోంది. గొంగళి పురుగు నుంచి రంగురంగుల సీతాకోక చిలుక రెక్కలు తొడిగినట్లు సమాజం కూడా చెడిపోతున్న ప్రతిసారి తనకు తానే సరిదిద్దుకుంటుందని అంటుంటారు చాలామంది. ఈ కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలు చనిపోవడం బాధాకరం. ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమను తాము కాపాడుకుంటూ ప్రపంచాన్ని కాపాడాల్సిన తరుణమిది. అయితే, ప్రకృతి గురించి కాసేపు ఆలోచిద్దాం.. భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లోకి శక్తిమంతుడు కాకపోయినా.. బుద్ధిమంతుడు […]
దిశ వెబ్ డెస్క్: ప్రపంచమంతా కరోనా వైరస్ (కోవిడ్-19) భయంతో వణికిపోతోంది. గొంగళి పురుగు నుంచి రంగురంగుల సీతాకోక చిలుక రెక్కలు తొడిగినట్లు సమాజం కూడా చెడిపోతున్న ప్రతిసారి తనకు తానే సరిదిద్దుకుంటుందని అంటుంటారు చాలామంది. ఈ కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలు చనిపోవడం బాధాకరం. ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమను తాము కాపాడుకుంటూ ప్రపంచాన్ని కాపాడాల్సిన తరుణమిది. అయితే, ప్రకృతి గురించి కాసేపు ఆలోచిద్దాం..
భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లోకి శక్తిమంతుడు కాకపోయినా.. బుద్ధిమంతుడు మనిషే. అందుకే అన్నింటినీ తన కంట్రోల్‌లో ఉంచుకోవాలని ఆశ పడతాడు. అందుకోసం ఏదైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. జనాభా పెరుగుతున్న కొద్దీ అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అందుకోసం ప్రకృతికి నష్టం కలిగించే పనులు చేస్తూ మనం కూడా నష్టపోతున్నాం. ప్లాస్టిక్ వాడకూడదని ప్రభుత్వాలు హెచ్చరించినా, జరిమానాలు విధించినా ప్లాస్టిక్ వాడుతూనే ఉంటాము. చిన్న, చిన్న పనులకు వాహనాలు వాడకూడదని తెలిసినా.. అదే పని చేసి చూపిస్తాం. ఆఫీసులు, కాలేజీలు, ఇతర పనులకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించాలనే అవగాహన ఉన్నా కూడా వాహనాలు, కార్లనే వినియోగిస్తాం. చివరకు కార్ పూలింగ్, బైక్ పై లిఫ్ట్ ఇవ్వడం వంటి పనులు కూడా చేయం. మన నివాసం కోసం.. జంతువులు, పక్షులు, ఆది మానవులకు నిలయమైన అడవులను నరుక్కుంటూ వెళ్తున్నాం. పంటలను.. ప్లాట్లుగా మారుస్తున్నాం. ఆ పరిణామం వల్లే ఎన్నో జంతువులు తమ ఆవాసం, ఆహారాన్ని కోల్పోయి.. ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. కోతులు, వన్యప్రాణులు నగరాల్లోకి వచ్చేస్తున్నాయి. మనం ఉపయోగించే సెల్ ఫోన్ వల్ల, ఉండటానికి గూడు లేక పిచ్చుకలు కనపడకుండా పోయాయి. విదేశాల నుంచి వలస వచ్చే ఎన్నో పక్షులు రాకుండా పోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతికి మనం చేసే నష్టాలు లెక్కకుమించే ఉంటాయి.
కరోనా ఏం చేసింది?
కరోనా.. చైనాను దాటి ప్రపంచ దేశాల్లో అడుగుపెట్టింది. అది ప్రజలందరినీ భయబ్రాంతులకు గురి చేస్తూ ఇళ్లకే పరిమితం చేసింది. ఘర్షణల సమయాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన రోజుల్లోనైనా జనాలు రోడ్లపైకి వస్తారేమో కానీ, కరోనా కర్ఫ్యూ మూలంగా అందరూ గడప దాటి రావడం లేదు. కరోనా కట్టడి చేయాలంటే ప్రజలంతా ప్రభుత్వానికి, ప్రధానంగా వైద్యులకు ఇలానే సహకరించాలి. మరో 15 రోజులు ప్రజలంతా తమకు తాముగా క్వారంటైన్ అయితే విడివిడిగా ఉంటూ కరోనా రక్కసి అంతమొందించడానికి ఉమ్మడి విజయం సాధించినవాళ్లమవుతాం. దీనివల్ల కరోనా మహమ్మారిని జయించడమే కాదు పర్యావరణానికి ఎంతో మేలు చేసినవాళ్లమవుతాం కూడా.
ప్రకృతికి పరోక్ష ఉపకారం..
మన దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఎంత పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా వంటి మెట్రో నగరాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా వాయు కాలుష్యం తీవ్రంగానే ఉంది. కరోనా మూలంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో కాలుష్యం చాలా వరకు తగ్గింది. మనదగ్గరే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా చాలావరకూ వాయు కాలుష్యం తగ్గుతోంది. రణగొణ ధ్వనులు కూడా తగ్గుతున్నాయి. ప్రజలు క్రమశిక్షణ పాటిస్తూ, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇవన్నీ కరోనా వైరస్ వల్ల కలుగుతున్న ప్రయోజనాలుగా కొందరు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
వెనిస్ నగరమే నిదర్శనం..
కరోనా వైరస్ వల్ల వెనిస్ మళ్లీ అందాల నగరంగా మారింది. ప్రపంచంలోనే అతి సుందరమైన నగరాల్లో వెనిస్ ఒకటి. వెనిస్ భవనాలు మనల్ని ప్రేమలో పడేస్తాయి. నీటిపై తేలియాడే ఈ నగరాన్ని చూడటానికి ప్రపంచ దేశాల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఎప్పుడైతే కరోనా వైరస్ వచ్చిందో, పర్యాటకుల రాక ఆగిపోయింది. స్థానికులు కూడా ఇళ్లలోంచీ బయటకు రావడం మానేశారు. దాంతో మురికిగా మారిపోయిన వెనిస్ నగర నీళ్లు.. ఇప్పుడు తిరిగి స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా వెనిస్ నీళ్లలో కనిపించకుండా పోయిన డాల్ఫిన్లు, చేపలు కనిపిస్తున్నాయి. హంసలు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. చాలా సంవత్సరాలుగా కనపడని పక్షులు, జంతువులు తిరిగి సంతోషంగా విహరిస్తున్నాయి. ఇది మంచి పరిణామామని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.
పర్యావరణ ప్రేమికుల కళ్లతో చూస్తే..
ప్రజల ప్రాణాల్ని తీస్తున్న కరోనా వైరస్ భయంకరమైందే. కానీ, పర్యావరణానికి మేలు చేస్తోంది. మన వల్లే ఈ భూమి నాశనమైపోతోందని మనందిరికీ తెలుసు. పర్యావరణ హితమైన పనులు చేయడంలో వెనుకంజ వేస్తుంటాం. పైగా పర్యావరణాన్ని పాడు చేయడంలో ముందుంటాం. పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో, జంతువులకు, పక్షులకు ఎంత విఘాతం కలుగుతుందో.. మనం ఇప్పుడైనా అర్థం చేసుకోవాలని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. ప్రపంచ ప్రజలంతా తమకు తాముగా స్వచ్ఛంద క్వారెంటైన్ కావడంతో పర్యావరణం తిరిగి బాగుపడుతోందని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. అసలు మనుషుల విపరీత చర్యల వల్లే కరోనా లాంటి వైరస్‌లు కూడా పుట్టుకొస్తున్నాయనీ… ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిదని కూడా వారు చెబుతున్నారు.
Tags : CORONA VIRUS, COVID-19, ENVIRONMENTAL, POLLUTION, LAND, WATER, VENICE, DOLPHIN, FISH, ANIMALS, BIRDS