Zelensky: మోడీతో సానుకూలంగా చర్చలు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
న్యూయార్క్‌లో భారత ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలు భేటీ అయిన విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జీఏ) సమావేశాల సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్‌లో సోమవారం భారత ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలు భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం సానుకూలంగా జరిగిందని మోడీతో భేటీ కావడం బాగుందని జెలెన్ స్కీ తెలిపారు. ఓ మీడియా చానెల్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై జరిగిన చర్చలు ఆశాజనకంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని పరిస్థితి, శాంతి మార్గాన్ని అనుసరించేందుకు మోడీ చూపిన చొరవ ప్రముఖంగా కనిపించింది. దౌత్యం, సంభాషణలకు స్పష్టమైన, స్థిరమైన తన విధానాన్ని మోడీ వెల్లడించారు. వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి భారత్ తన పరిధిలోని మద్దతును సంపూర్ణంగా అందించడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు’ అని జెలెన్ స్కీ చెప్పారు. కాగా, నెల రోజుల వ్యవధిలోనే ఇరువురు నేతలు భేటీ కావడం ఇది రెండోసారి. ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా ఆగస్టు 23న మోడీ జెలెన్ స్కీని కలిశారు.