శ్రీరాముడి ప్రేరణతో ‘సబ్‌కా వికాస్’.. రాష్ట్రపతికి ప్రధాని లేఖ
దిశ, నేషనల్ బ్యూరో : ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ అనే నినాదాన్ని భగవాన్ శ్రీరాముడి నుంచి ప్రేరణ పొంది తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ అనే నినాదాన్ని భగవాన్ శ్రీరాముడి నుంచి ప్రేరణ పొంది తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ‘‘ఈ నినాదం ఫలితాలు ప్రస్తుతం దేశంలో ప్రతిచోటా కనిపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో విజయం సాధించాం’’ అని చెప్పారు. భగవాన్ శ్రీరాముడి ఆదర్శాలు.. పేదల సంక్షేమం, సాధికారతలను సాధించే దిశగా పనిచేసేందుకు తమకు నిరంతరం శక్తిని ప్రసాదిస్తాయని ఆయన పేర్కొన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనకు రాసిన లేఖకు బదులిస్తూ ప్రధాని మోడీ మరో లేఖ రాశారు. ఈ లేఖలోనే ప్రధాని మోడీ తాజా కామెంట్స్ చేశారు. ‘‘రాష్ట్రపతి లేఖను అందుకునే సమయానికి నేను భిన్నమైన మానసిక స్థితిలో ఉన్నాను. ఆ సమయానికి నాలో ఏర్పడిన భావాలను ఎదుర్కోవడానికి, వాటితో ఏకాభిప్రాయాన్ని కుదుర్చుకోవడానికి రాష్ట్రపతి లేఖ దోహదం చేసింది’’ అని మోడీ తెలిపారు. ‘‘మీరు నా 11 రోజుల ఉపవాస ఆచారాల గురించి, వాటికి సంబంధించిన యమ నియామకాల గురించి మాట్లాడారు. కొన్ని శతాబ్దాలుగా మరెంతో మంది ఇదే అయోధ్య రామమందిరం కోసం తమను తాము సమర్పించుకున్నారు. వాళ్లందరి త్యాగనిరతికి మన దేశమే సాక్ష్యం’’ అని చెప్పారు.