Wayanad :వయనాడ్‌లో 100 ఇళ్లు నిర్మిస్తాం.. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో : కొండచరియలు విరిగిపడి అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న ప్రభావిత గ్రామాల్లో 100కుపైగా ఇళ్లను నిర్మిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు.
దిశ, నేషనల్ బ్యూరో : కొండచరియలు విరిగిపడి అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న ప్రభావిత గ్రామాల్లో 100కుపైగా ఇళ్లను నిర్మిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ ఇళ్లను నిర్మించి బాధిత కుటుంబాలకు అందిస్తామని వెల్లడించారు. తాను జాతీయ స్థాయిలో ఈ అంశంపై తప్పకుండా మాట్లాడుతానని ఆయన తెలిపారు. వయనాడ్‌లో చోటుచేసుకున్న విపత్తును విభిన్నంగా చూడాలని, అక్కడి బాధిత ప్రజలను తప్పకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. ఈవిషయమై కేరళ ప్రభుత్వంతోనూ తాను సంప్రదింపులు జరుపుతానని రాహుల్ గాంధీ చెప్పారు.
వయనాడ్ జిల్లాలోని ముందక్కై, పంచిరి మట్టం గ్రామాలను శుక్రవారం ప్రియాంకాగాంధీ, రాహుల్ సందర్శించారు. అక్కడి బాధిత కుటుంబాలను పరామర్శించి మేమున్నామనే భరోసా ఇచ్చారు. అక్కడి ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యల వివరాలను జిల్లా అధికారులు, ఫారెస్టు ఆఫీసర్లు ఈసందర్భంగా వారికి వివరించారు. వయనాడ్ జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో 150 కుటుంబాల ఇళ్ల నిర్మాణానికి నేషనల్ సర్వీస్ స్కీం (ఎన్ఎస్ఎస్) ద్వారా వాలంటరీ సర్వీస్ అందుతుందని కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు వెల్లడించారు.