ఈ ఏడాది కూడా అందులో ఢిల్లీనే వరల్డ్ టాప్.. మరి, బతికేదెలాగో..?!
ఇది కడు శోచనీయం, కడు విచారించదగిన విషయం! World's most polluted capital city is Delhi.
దిశ, వెబ్‌డెస్క్ః ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సమస్యలున్నప్పటికీ అన్ని దేశాలూ ఏకతాటిపైకి వచ్చి పరిష్కరించాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం పర్యావరణ మార్పు. అయితే, అంతర్జాతీయంగా అత్యంత కాలుష్యాకారకాల్ని విడుదల చేస్తున్న అమెరికా, చైనా వంటి దేశాల్ని కూడా వెనకకు నెట్టి, ముందు వరుసలోకి వచ్చి, 'కాలుష్యంలో మేమే టాప్' అంటోంది భారతదేశ రాజధాని నగరం ఢిల్లీ. ఇది కడు శోచనీయం, కడు విచారించదగిన విషయం! ఎందుకంటే, ఢిల్లీ ఈ స్థానంలో ఉండటం మొదటిసారేమీ కాదు. ప్రపంచంలో వరుసగా రెండోసారి టాప్ కాలుష్య నగరంగా ఉంది. తాజాగా విడుదల చేసిన, 2021 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్‌లో ఇంకా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని ప్రకారం ఏ ఒక్క దేశం కూడా తాజా WHO PM 2.5 వార్షిక గాలి నాణ్యత మార్గదర్శకాలను పాటించలేదు. కేవలం 3% నగరాలే దీనిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
ఇక, ఢిల్లీ తర్వాత స్థానాల్లో ఢాకా (బంగ్లాదేశ్), ఎన్'జమెనా (చాడ్), దుషాన్‌బే (తజికిస్థాన్), మస్కట్ (ఒమన్) ఉన్నాయి. అంతేనా, 2021లో మధ్య, దక్షిణాసియాలోని 15 అత్యంత కాలుష్య నగరాల్లో 12 భారతదేశంలోనే ఉండటం విశేషం. అలాగే, భారతదేశంలోని 48% నగరాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన వాయు నాణ్యత మార్గదర్శకాల కంటే 10 రెట్లు ఎక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం. భారతదేశంలో ఉన్న మరో అపోహ ఢిల్లీకి సమీపంలోని వరి పొలాలలో పంట దహనంతో ఏర్పడే పొగ వల్ల 45% కాలుష్యం ఏర్పడుతుందని. దీనిపై, వివిధ వాదనలు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ, భూ గ్రహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది. అందులోనూ, ఎన్నో గొప్ప ప్రకృతి వనరులున్న దేశంగా గుర్తింపబడిన భారతదేశానికి ఇలాంటి దుస్థితి రావడం అందరూ ఆలోచించాల్సిన అంశం.