నేటి ప్రపంచానికి ఎలాంటి ప్రభుత్వాలు కావాలో చెప్పిన మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : స్వచ్ఛమైన, పారదర్శక పాలనతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం లభిస్తుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : స్వచ్ఛమైన పారదర్శక పాలనతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం లభిస్తుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పుడు ప్రపంచ ప్రజలకు స్మార్ట్, హైటెక్ ప్రభుత్వాలు అవసరమని చెప్పారు. అధునాతన సాంకేతికతను వాడుకొని పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా పాలనను అందించడం ఇప్పుడు అత్యవసరమని పేర్కొన్నారు. దుబాయ్‌లోని అబుధాబిలో బుధవారం జరిగిన ‘ప్రపంచ ప్రభుత్వాల సదస్సు’లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘‘ఒకవైపు ప్రపంచం ఆధునిక సాంకేతికతను స్వీకరిస్తోంది. మరోవైపు గత శతాబ్ద కాలంగా కొత్తకొత్త సవాళ్లు చుట్టుముడుతున్నాయి. ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, నీటి భద్రత, ఇంధన భద్రత, సమ్మిళిత సమాజాన్ని నిర్మించడం వంటి కీలక బాధ్యతలు ప్రభుత్వాలకు లభించాయి’’ అని ఆయన చెప్పారు. పౌరుల సంక్షేమం కోసం ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోడీ తన ప్రసంగంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ నాయకత్వాన్ని ప్రశంసించారు. విజన్, సంకల్పమున్న నాయకుడిగా జాయెద్‌ను అభివర్ణించారు.
పదేళ్లలో 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి..
‘‘ప్రపంచ జనాభాలో 17 శాతం భారత్‌లోనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ యాక్సెస్ కార్యక్రమాలను మేం చేపడుతున్నాం. అయినప్పటికీ భారతదేశపు కార్బన్ ఉద్గారాలు ప్రపంచ మొత్తంలో 4 శాతం మాత్రమే ఉన్నాయి’’ అని ప్రధాని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ కేవలం గత పదేళ్లలో ప్రపంచంలో 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకిందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి తాము అలుపెరగకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరిగిన పర్యావరణ పరిరక్షణ ఒప్పందం నిబంధనల అమలులో భారత్ నిక్కచ్చిగా వ్యవహరిస్తోందని చెప్పారు. 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్యారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA)కు ప్రధాని అభినందనలు తెలిపారు.