దేశంలో ‘వన్ నేషన్-వన్ మిల్క్’ నినాదాన్ని అనుమతించం.. బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని డెయిరీ కోఅపరేటివ్స్‌ను నియంత్రిస్తున్న బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ విరుచుకపడ్డారు. దేశంలో వన్ నేషన్-వన్ మిల్క్ నినాదాన్ని అనుమతించబోమని చెప్పారు. అమూల్, నందిని రెండూ దేశంలో శ్వేత విప్లవంలో విజయవంతమైన కథలుగా ఉన్నాయని అన్నారు. దశాబ్దాలుగా ఈ వికేంద్రీకరణ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి, కోట్లాది మంది పాడి రైతులకు స్వయంప్రతిపత్తిని కల్పించడానికి కాంగ్రెస్ సహాయపడిందని ఆయన అన్నారు.
సహకార సంఘాలను రాష్ట్ర అంశంగా స్పష్టంగా గుర్తించే రాజ్యాంగాన్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వం పూర్తి నియంత్రణను ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ నేత ఆరోపించారు. అయితే కేంద్ర అమిత్ షా వీటిన్నింటిని నియంత్రణలోకి తీసుకుని ఒక్కరికే ఇవ్వాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ చారిత్రాత్మక సొసైటీలను ఏకీకృతం చేయడం ద్వారా రైతుల నియంత్రణను తమ నియంత్రణతో భర్తీ చేయాలని అమిత్ షా, బీజేపీ భావిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు రైతుల సాధికారతను తగ్గించి వారి జీవనోపాధికి ప్రమాదకరంగా మారుతాయని అన్నారు. అయితే అన్నింటిని నియంత్రణలోకి తీసుకోవాలనే బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటుందని తెలిపారు.