Killer Wolves : ఉత్తర ప్రదేశ్‌లో తోడేళ్ల వేట! చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లి చంపి తింటున్న తోడేళ్లు

ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో తోడేళ్ల వేట కోనసాగుతోంది. ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా 4 తోడేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకొని జూకి తరలించారు.

Update: 2024-08-31 08:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో తోడేళ్ల వేట కోనసాగుతోంది. ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా 4 తోడేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకొని జూకి తరలించారు. మిగతా వాటి కోసం అధికారులు తాజాగా మళ్లీ ఉచ్చులు బిగిస్తున్నారు. గత రెండు నెలల్లో బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడిలో ఏడుగురు చిన్నారులు, ఒక మహిళ చనిపోయారని అటవీ శాఖ స్పష్టం చేసింది. దాదాపు 15 మందికి పైగా తోడేళ్ల దాడిలో గాయపడ్డారని నిర్ధారించింది. అయితే, కేవలం 45 రోజుల్లోనే తోడేళ్ల దాడిలో ఎనిమిది మంది మృతి చెందడంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోని చిన్నారులను ఎత్తుకెళ్లి తోడేళ్లు చంపి తింటున్నాయి. దాదాపు వీటి దాడిలో తొమ్మిది మంది చనిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

తోడేళ్ల దాడుల కారణంగా 30కి పైగా గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతూ.. రాత్రంతా కాపలా కాస్తున్నారు. గ్రామస్తులు తమ కుటుంబాలను తోడేళ్ల నుంచి కాపాడుకోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిసర ప్రాంత ప్రజలు బాణసంచా, టార్చ్ లైట్లు సిద్ధం చేసుకున్నారు. తోడేళ్ల భయపెట్టేందుకు ప్రతి గంటకు ఒకేసారి నాలుగైదు గ్రామాల్లో ప్రజలు బాణసంచా కాల్చడం మొదలు పెట్టారు. టార్చ్‌లైట్‌ వెలుగులతో పంటపొలాల్లో నిఘా పెట్టారు. కాగా, సెంట్రల్ జోన్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ రేణు సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజుల నుంచి ఇక్కడ తోడేళ్లు విద్వంసం సృష్టిస్తున్నాయని, ఇప్పటి వరకు 4 తోడేళ్లు పట్టుకున్నామని తెలిపారు. 2 తోడేళ్లు మిగిలి ఉన్నాయని వాటిని పట్టుకోవడం కోసం ఉచ్చులు బిగించామని వెల్లడించారు. వీలైనంత త్వరగా వాటిని పట్టుకుంటామని వెల్లడించారు.


Similar News