IAF: వైమానిక దళం సీనియర్ వింగ్ కమాండర్‌పై లైంగిక ఆరోపణలు
రెండేళ్లుగా వింగ్ కమాండర్ అధికారి మానసికంగా వేధిస్తున్నారని, అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు
దిశ, నేషనల్ బ్యూరో: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో సీనియర్ వింగ్ కమాండర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం చర్చనీయాంసమైంది. జమ్మూకశ్మీర్‌లో ఓ మహిళా ఫ్లయింగ్ అధికారి బుద్గామ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గడిచిన రెండేళ్లుగా వింగ్ కమాండర్ అధికారి తనను మానసికంగా వేధిస్తున్నారని, అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనగర్ బేస్‌లో పనిచేస్తున్న సమయంలో 2023, డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వింగ్ కమాండర్ గిఫ్ట్ ఇచ్చే నెపంతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపణలు చేశారు. శృంగారం కోసం తనను బలవంతం చేశారని, భయంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చానని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఐఏఎఫ్ ఈ కేసు దర్యాప్తుకు సహకరిస్తున్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించి స్థానిక పోలీసు అధికారులు శ్రీనగర్‌లోని ఐఏఎఫ్‌ను సంప్రదించారు. వారికి పూర్తిగా సహకారం అందిస్తున్నామని ఐఏఎఫ్ అధికారులు పేర్కొన్నారు.