కేజ్రీవాల్, సోరెన్ సతీమణుల భేటీ.. ఎజెండా అదే!
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌లను ఇటీవల ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌లను ఇటీవల ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు దిగ్గజ నేతల సతీమణులు సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్ శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం జరగనున్న ఇండియా కూటమి సమావేశంపై వారు చర్చించారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కారుపై కలిసికట్టుగా పోరాడాలని సునీత, కల్పన ఈసందర్భంగా నిర్ణయించారు. అంతకుముందు ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్న కల్పనా సోరెన్‌కు సునీతా కేజ్రీవాల్ సాదర స్వాగతం పలికారు. సునీతా కేజ్రీవాల్, ఆమె కుటుంబ సభ్యులకు కల్పన తన మద్దతును ప్రకటించారు. తన భర్త హేమంత్ సోరెన్ అరెస్టును ప్రస్తావిస్తూ.. గతంలో జార్ఖండ్‌లో జరిగిన సీనే ఇప్పుడు ఢిల్లీలోనూ రిపీట్ అయిందని కల్పనా సోరెన్ కామెంట్ చేశారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను నియంతృత్వ కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసినప్పటికీ.. ఈ ఇద్దరు మహిళలు తమ తమ రాష్ట్రాల ప్రజల సహకారంతో బలంగా నిలబడి పోరాడుతున్నారు’’ అని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. సునీత, కల్పనలు ఆప్యాయంగా కరచాలనం చేస్తున్న ఫొటోలను ఈ పోస్టుకు జతపరిచింది. త్వరలోనే ఢిల్లీ సీఎంగా సునీతా కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టనున్నారనే ప్రచారం నడుమ.. ఆప్ చేసిన ఈ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, ఆదివారం ఉదయం ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా జరిగే ఇండియా కూటమి సభలో సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్ పాల్గొననున్నారు.