ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై స్పందించిన నిర్మలా సీతారామన్
విరాళాలకు, దర్యాప్తు సంస్థల దాడులకు సంబంధం ఉందన్న ప్రచారాలన్నీ ఊహాగానాలే.
దిశ, నేషనల్ బ్యూరో: భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎస్‌బీఐ అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. అయితే, ఆ వివరాల్లో ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన కొన్ని సంస్థలపై గతంలో సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయనే అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. డేటా ప్రకారం, రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళం ఇచ్చిన మొదటి 30 కంపెనీల్లో 15 కంపెనీలకు పైగా ఈడీ, సీబీ, ఆదాయ పన్ను శాఖల నుంచి దర్యాప్తును ఎదుర్కొన్నాయి. ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. శుక్రవారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. విరాళాలకు, దర్యాప్తు సంస్థల దాడులకు సంబంధం ఉందన్న ప్రచారాలన్నీ ఊహాగానాలే. దర్యాప్తు సంస్థలు దాడి చేస్తేనే బాండ్లను కొన్నారనేది పూర్తిగా అవాస్తవం. బాండ్లు కొన్న తర్వాత కూడా ఆయా కంపెనీలపై ఈడీ, సీబీఐ దాడులు జరిగాయి. పైగా ఆ కంపెనీలు బీజేపీకే విరాళం ఇచ్చాయని చాలామంది భావిస్తున్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా అవి వెళ్లాయని ఆర్థిక మంత్రి వివరించారు. ఎన్నికల బాండ్లకు సంబంధించి పూర్తీ సమాచారం ఉన్న వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన అంశం గురించి మాట్లాడుతూ, అది కోర్టు పరిధిలో ఉంది. దాని గురించి ఎస్‌బీఐ చూసుకుంటుందన్నారు. తనకంటే ముందు ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ మునుపటి కంటే మెరుగైనదని భావించి ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన బాండ్లు నేరుగా పార్టీల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని పేర్కొన్నారు.