ఉత్తరాఖండ్‌లో అమలు చేయబోతున్న "యూనిఫాం సివిల్ కోడ్" ఏంటి?
"యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)"ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించబోతోంది. What is Uniform Civil Code?
దిశ, వెబ్‌డెస్క్ః భారతదేశంలో "యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)"ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించబోతోంది. ఈ మౌంటేన్ స్టేట్‌కి మరోసారి కొత్తగా ఎన్నికైన బిజెపి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. "యూనిఫాం సివిల్ కోడ్ (UCC)" అంటే దేశం మొత్తానికి ఒకే విధమైన చట్టాన్ని రూపొందించి అమలు చేయాలనే ఓ రాజ్యాధికార చట్టం. అది ఆ రాజ్యం అత్యధిక అధికారాలను ఉపయోగించి తీసుకునే నిర్ణయం. ఈ ఏకరూప చట్టంలో భాగంగా ఆ రాజ్యంలోని వివాహం, విడాకులు, ఆస్తి వారసత్వం, దత్తత వంటి ఇతర విషయాలలో అన్ని మత సంఘాలకు ఒకే చట్టం వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న ముస్లీమ్ వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం వంటివి లేకుండా ఒకే చట్టం కిందకు అందరూ వస్తారు.
భారత రాజ్యాంగంలోని పార్ట్ 4, ఆర్టికల్ 44లో యూనిఫాం సివిల్ కోడ్‌ను స్పష్టంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 44, 'భారత భూభాగంలోని అందరు పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళిని వర్తింపజేయడానికి రాష్ట్రం ప్రయత్నించడమే' ఈ సివిల్ కోడ్ అని తెలియజేస్తుంది. అయితే, భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌పై మొదటి పిటిషన్ 2019లో దాఖలు చేశారు. జాతీయ సమైక్యత, లింగ న్యాయం, సమానత్వం, మహిళల గౌరవాన్ని ప్రోత్సహించడానికి UCCని రూపొందించాలని ఇందులో కోరారు. కానీ, ఈ చట్టాన్ని వ్యతిరికిస్తున్నవారూ లేకపోలేదు. ఇది భారతదేశంలోని భిన్న సంస్కృతులకు, విశ్వాసాలకు తూట్లు పొడుస్తుందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది.