Dark Tourism : టూరిస్టులకు ‘డార్క్ టూరిజం’ అలర్ట్.. ఇంతకీ ఏమిటిది ?
దిశ, నేషనల్ బ్యూరో : క్లౌడ్ బరస్ట్ కారణంగా వయనాడ్ జిల్లాలోని పలు మారుమూల ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న జల విలయం పెను విషాదాన్ని మిగిల్చింది.
దిశ, నేషనల్ బ్యూరో : క్లౌడ్ బరస్ట్ కారణంగా వయనాడ్ జిల్లాలోని పలు మారుమూల ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న జల విలయం పెను విషాదాన్ని మిగిల్చింది. ఎంతోమంది ప్రాణాలను బలిగొంది. కేరళ రాష్ట్రం పెద్ద టూరిస్ట్ హబ్. అక్కడికి నిత్యం పెద్ద సంఖ్యలో టూరిస్టులు వెళ్తుంటారు. ఈనేపథ్యంలో కేరళ పోలీసులు టూరిస్టులకు కీలక అడ్వైజరీని జారీ చేశారు. డార్క్ టూరిజం ప్లేస్‌లకు వెళ్లొద్దని పర్యాటకులను ‘ఎక్స్’ వేదికగా కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే 112కు కాల్ చేయాలన్నారు. ఇంతకీ ‘డార్క్ టూరిజం’ అంటే ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..
కేరళ పోలీసుల అడ్వైజరీ ఎందుకంటే ?
సాధారణ టూరిజం అనే ఆహ్లాదకర ప్రదేశాలు, ఆనందదాయక స్థలాలతో కూడుకొని ఉంటుంది. ఆయా చోట్లకు వెళితే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇటువంటి ప్రదేశాలకు వెళ్లడం ఎంతో ఈజీ కూడా. జర్నీలో పెద్దగా సవాళ్లు ఎదురుకావు. కానీ ‘డార్క్ టూరిజం’ అనేది ఇందుకు పూర్తి విభిన్నం. యుద్ధాలు జరిగిన ప్రదేశాలు, ఊచకోతలు/మారణహోమాలు జరిగిన ప్రదేశాలు, వరదలు/ఇతరత్రా ప్రకృతి విపత్తులతో నష్టపోయిన ప్రదేశాల వంటివి డార్క్ టూరిజం ప్లేస్‌లలోకి వస్తాయి. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లడం కొన్ని దేశాల్లో సవాళ్లతో కూడుకున్న అంశమే. ఇప్పుడు వయనాడ్ జిల్లాలో ప్రకృతి విపత్తుతో పెద్దసంఖ్యలో మరణాలు సంభవించిన ప్రాంతాలను చూడాలనే ఆసక్తి కూడా కొంతమంది టూరిస్టులకు రావచ్చు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, బాధితుల అనుభవాలు తెలుసుకోవాలనే కుతూహలంతో కొందరు అక్కడికి వెళ్లాలనే అత్యుత్సాహాన్ని కనబర్చే అవకాశం ఉంటుంది. అయితే ఆయా ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. అక్కడికి రోడ్ కనెక్టివిటీ కూడా సవ్యంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వెళితే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే డార్క్ టూరిజం మానుకోవాలని టూరిస్టులను కేరళ పోలీసులు కోరారు. ఒకవేళ వయనాడ్ జిల్లాలోని ప్రభావిత ప్రాంతాలకు టూరిస్టులు వెళితే సహాయక టీమ్స్ చేపడుతున్న రెస్క్యూ వర్క్స్‌కు ఆటంకం కలుగుతుందని తెలిపారు.
భారత్‌లోని ప్రధాన డార్క్ టూరిజం సైట్లు..
మనదేశంలోని ప్రధాన డార్క్ టూరిజం ప్లేసుల వివరాల్లోకి వెళితే.. పోర్ట్ బ్లెయిర్ సెల్యులార్(కాలాపానీ) జైలు, ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్ సరస్సు, జైసల్మేర్‌లోని కుల్‌ధారా గ్రామం వంటివి ఉంటాయి. కాలాపానీ జైలు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. దీన్ని ఇప్పుడు మన నేషనల్ మ్యూజియంగా మార్చారు. బ్రిటిష్ పాలనా కాలంలో దేశంలోని ప్రధాన నగరాలకు దూరంగా ఉన్న ఈ జైలులో మన స్వాతంత్య్ర సమరయోధులను బంధించేవారు. ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్ సరస్సులో చాలా మంది వ్యక్తుల అస్థిపంజరాల అవశేషాలు ఉన్నాయి. వాటి మిస్టరీ నేటికీ వీడలేదు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఉన్న కుల్ ధారా గ్రామంలోని ప్రజలంతా ఒకే ఘటనలో చనిపోయారని అంటారు. ఆ ప్రాంతానికి చెందిన దుర్మార్గపు ప్రధానమంత్రి సలీం సింగ్, గ్రామపెద్ద కుమార్తెను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ఊరివాళ్లను చంపేశాడని చెబుతుంటారు. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లి చరిత్రను తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. ఆనాడు విషాదం మిగిల్చిన ప్రదేశాలను ఈనాడు వెళ్లి చూడటాన్ని.. నాటి ఘట్టాల గురించి లోతుగా తెలుసుకోవడాన్ని అపూర్వ విషయంగా పలువురు టూరిస్టులు భావిస్తారు.
విదేశాల్లోని ప్రధాన డార్క్ టూరిజం సైట్లు..
డార్క్ టూరిజంను థానాటూరిజం అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలు ఈరకమైన టూరిజంకు పెట్టింది పేరు. ఈ జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగినవి.. చెర్నోబిల్ (ఉక్రెయిన్), గెట్టిస్‌బర్గ్ (అమెరికా), ఆష్‌విట్జ్ (పోలండ్), అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య జరిగిన టెక్సాస్ స్కూల్ బుక్ డిపాజిటరీ (డల్లాస్ - అమెరికా). ఇటీవల కాలంలో కొందరు టూరిస్టులు సాహసించి యుద్దంతో అట్టుకుడుతున్న సిరియాలోనూ పర్యటించారు. అమెరికాలోని ఒహియోకు చెదిన 21 ఏళ్ల అటో వార్మ్‌బైర్ 2015లో సిరియాలో పర్యటిస్తుండగా.. చిన్నపాటి అభియోగంతో జైలు పాలయ్యాడు. అతడు 17 నెలలు జైలులో ఉండాల్సి వచ్చింది. విడుదలయ్యే సమయానికి ఆ యువకుడు కోమాలోకి వెళ్లిపోయాడు. అమెరికాకు తిరిగొచ్చిన ఆరు రోజుల తర్వాత అటో వార్మ్‌బైర్ చనిపోయాడు. అందుకే డార్క్ టూరిజం ప్రదేశాలకు వెళ్లొద్దని సూచిస్తుంటారు.