పశ్చిమ బెంగాల్ రేషన్ కుంభకోణం: టీఎంసీ నేత అరెస్టు
రేషన్ కుంభకోణానికి సంబంధించిన కేసులో టీఎంసీ నేత శంకర్ ఆధ్యను ఈడీ శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రేషన్ కుంభకోణానికి సంబంధించిన కేసులో బొంగావ్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత శంకర్ ఆధ్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసింది. ఆయనను కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా, ఇదే కేసుకు సంబంధించి ఉత్తర 24 పరగణాల జిల్లాలో టీఎంసీ నేతలు శంకర్ ఆధ్య, షేక్ షాజహాన్‌ల ఇళ్లపై తనిఖీలు చేసేందుకు ఈడీ అధికారులు వెళ్తుండగా వారిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు ఆఫీసర్స్‌కు గాయాలయ్యాయి. సుమారు 1000 మంది తమపై దాడికి పాల్పడినట్టు ఈడీ పేర్కొంది. అంతేగాక వారు మారణాయుధాలు కలిగి ఉన్నారని తెలిపింది. ఈ క్రమంలోనే ఆధ్యను అరెస్టు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఈ కేసులో టీఎంసీ మంత్రి జ్యోతిప్రియ ముల్లిక్‌ను సైతం ఈడీ అరెస్టు చేసింది.