గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా భారత్ : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : భారతదేశాన్ని గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా మారుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : భారతదేశాన్ని గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా మారుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ‘‘వోకల్ ఫర్ లోకల్ నినాదంతో దేశీయ ఉత్పత్తులకు మేం కొత్త రెక్కలను తొడిగాం.. లోకల్ టు గ్లోబల్ నినాదాన్ని పరిశ్రమల సహకారంతో ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని ఆయన తెలిపారు. సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన గ్లోబల్ టెక్స్‌టైల్ ఈవెంట్ ‘భారత్ టెక్స్ 2024’ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘‘రాబోయే 25 ఏళ్లలో వికసిత్ భారత్‌ను మేం నిర్మిస్తాం. దీనికి నాలుగు ముఖ్యమైన మూల స్తంభాలు పేదలు, యువత, రైతులు, మహిళలు. ముఖ్యంగా ఈ స్తంభాలన్నింటితో పాటు భారత టెక్స్‌టైల్ రంగం కూడా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. ప్రభుత్వ స్థిరమైన ప్రయత్నాల వల్ల భారతదేశ టెక్స్‌టైల్ రంగంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. 2014కు మునుపటితో పోలిస్తే ప్రస్తుతం భారతీయ టెక్స్‌టైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రెట్టింపయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే పత్తి, జనపనార, పట్టు ఉత్పత్తిలో భారత్ అగ్రగామిగా ఉందని తెలిపారు. 2014లో భారతదేశ టెక్స్‌టైల్ మార్కెట్ విలువ రూ.7 లక్షల కోట్ల కంటే తక్కువే ఉండేదని.. ఇప్పుడది రూ.12 లక్షల కోట్లు దాటిందని ప్రధాని వివరించారు.