దేశం కోసం రక్తం చిందిస్తాం..కానీ సీఏఏను మాత్రం అంగీకరించం: మమతా బెనర్జీ
దేశం కోసం రక్తం చిందించేందుకు పశ్చిమ బెంగాల్ సిద్ధంగా ఉందని..కానీ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ)లను మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్, సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశం కోసం రక్తం చిందించేందుకు పశ్చిమ బెంగాల్ సిద్ధంగా ఉందని..కానీ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ)లను మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్, సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. గురువారం కోల్ కతాలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో కొందరు జిమ్మిక్కులు చేస్తారని, వాటిని నమ్మి బలికావొద్దని ప్రజలకు సూచించారు. దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమే కానీ దేశంలో హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపారు. సీఏఏను అనుమతించబోమని, అన్ని మతాల మధ్య సామరస్యాన్ని కోరుకుంటున్నట్టు చెప్పారు. మనం ఐక్యంగా జీవిస్తే ఎవరూ మనకు హాని చేయలేరని వెల్లడించారు.
కాగా, గతంలోనూ మమతా బెనర్జీ రాష్ట్రంలో సీఏఏను అమలు చేయబోమని ప్రతిజ్ఞ చేశారు. సీఏఏ కింద పౌరసత్వానికి దరఖాస్తు చేసుకుంటే వారిని విదేశీయులుగా భావించే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే మమతా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే విమర్శించారు. శరణార్థులు భయపడకుండా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే మమతా మరోసారి స్పష్టం చేయడం గమనార్హం.