Wayanad landslides: 45 మంది మృతి, పదుల సంఖ్యలో గల్లంతు

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది.

Update: 2024-07-30 04:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 45 కి చేరింది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు (Wayanad Landslides) విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 45 మంది చనిపోగా.. వందలాది మంది శిథిలాలు, బురద కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 101 మందిని కాపాడినట్లు కేరళ రెవెన్యూ మంత్రి కె. రాజన్ తెలిపారు. విపత్తుపై ఇంకా కచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి కె.రాజన్ చెప్పారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (KSDMA), అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు (NDRF) ఘటనా స్థలిలో సహాయకచర్యలు చేపడుతున్నాయి. అదనపు సహాయక బృందాలు వయనాడ్ కు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు.. ఎంఐ-17, ఏఎల్‌హెచ్‌లను రంగంలోకి దించారు.

కొండచరియల కింద చిక్కుకున్న ప్రజలు

ముండకై, చురల్మల, అట్టమాల, నూల్పుజ గ్రామల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ముండకైలో అర్ధరాత్రి 2 గంటలకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డట్లు స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలు వరదలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

స్పందించిన సీఎం

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విచారం వ్యక్తం చేశారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతర ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. మంత్రులు వయనాడ్‌లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని ప్రకటించారు. ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది.


Similar News