శ్రీనగర్ జామా మసీదుకు తాళం!
దిశ, నేషనల్ బ్యూరో : రంజాన్ మాసంలోని పవిత్రమైన చివరి శుక్రవారం రోజు(ఏప్రిల్ 5న) శ్రీనగర్‌లోని జామా మసీదుకు పోలీసులు తాళాలు వేయడంపై కశ్మీర్ వేర్పాటువాద నేత మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఆవేదన వ్యక్తం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : రంజాన్ మాసంలోని పవిత్రమైన చివరి శుక్రవారం రోజు(ఏప్రిల్ 5న) శ్రీనగర్‌లోని జామా మసీదుకు పోలీసులు తాళాలు వేయడంపై కశ్మీర్ వేర్పాటువాద నేత మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు నమాజ్ చేయకుండా తమను అడ్డుకోవడం సరికాదన్నారు. ఆ మసీదులో నమాజ్ చదివించేందుకు వెళ్లకుండా తనను ఇంట్లోనే నిర్బంధించారని ఆయన వెల్లడించారు. ఈమేరకు ఓ వీడియో సందేశాన్ని మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దు, కరోనా సంక్షోభం వంటి కారణాలను చూపుతూ గత ఐదేళ్లుగా ప్రతీ రంజాన్ మాసంలోని చివరి శుక్రవారం రోజున శ్రీనగర్‌లోని జామా మసీదుకు తాళాలు వేస్తున్నారన్నారు. కనీసం మీడియాను కలిసేందుకు కూడా తనకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. కశ్మీర్ ప్రజల మతపరమైన హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని ఆయన ఆరోపించారు. నిరంకుశత్వం నీడలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారని మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ తెలిపారు.