Vinesh Phogat : ఫొగట్ భారతీయుల హృదయాల్లో ఛాంపియన్‌ : రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని స్పందన

దిశ, నేషనల్ బ్యూరో : ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్‌‌కు ముందు భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌‌పై అనర్హత వేటు పడటం అందరినీ షాక్‌కు గురిచేసింది.

Update: 2024-08-07 17:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్‌‌కు ముందు భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌‌పై అనర్హత వేటు పడటం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈసందర్భంలో ఎంతోమంది ఆమెకు అండగా ముందుకొచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా దీనిపై స్పందించారు. ‘‘140 కోట్ల మంది భారత ప్రజల హృదయాల్లో ఫొగట్‌ ఛాంపియన్‌గా నిలిచారు. ఆమెకు అందరూ అండగా నిలవాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ‘‘ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో వినేశ్ అసాధారణ ప్రతిభ కనబరిచారు. దేశం గర్వపడేలా చేశారు. భవిష్యత్తు క్రీడాకారులకు ఆమె ఆదర్శంగా నిలుస్తారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని అవార్డులు సాధించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొంటూ ద్రౌప‌ది ముర్ము ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఒలింపిక్స్‌లో వినేశ్ ఆటతీరు అద్భుతం. అనర్హత వేటు పడటంతో ఆమె ఎదుర్కొంటున్న బాధను పంచుకోవడానికి మేమంతా ఉన్నాం. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె ఆత్మస్థైర్యం ఎంతమాత్రం చెక్కుచెదరలేదు. భారత ప్రజల మనసుల్లో ఆమె ఒక ఛాంపియన్’’ అని పేర్కొన్నారు.

ప్రధాని మోడీ స్పందన ఇదీ..

వినేశ్‌ ఫొగట్‌‌పై అనర్హత వేటు పడిన అంశంపై అంతకుముందు ప్రధాని మోడీ కూడా ఎక్స్ ‌వేదికగా ఒకపోస్ట్ చేశారు. ‘‘వినేశ్‌కు ఎదురైన చేదు అనుభవం గురించి తెలుసుకొని చాలా బాధపడ్డాను. మీరు భారతదేశానికి గర్వకారణం. మీ వెంటే మేం ఉన్నాం.. బలంగా నిలబడండి’’ అని మోడీ పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో అనర్హత వేటును ఎదుర్కొన్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌‌‌కు న్యాయం చేయాలని కోరుతూ విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు మకర ద్వారం వద్ద నిరసన తెలిపారు. ఈ అంశంపై లోక్‌సభలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండ‌వీయ వివరణ ఇచ్చారు. ఫొగట్‌ నిర్దేశిత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువ ఉండ‌డంతో రెజ్లింగ్ 50 కేజీల విభాగం ఫైన‌ల్ నుంచి వైదొల‌గాల్సి వ‌చ్చింద‌న్నారు. ‘‘ఫొగట్‌ గతంలో దేశం కోసం చాలా విజయాలు సాధించారు. ఈ స‌మ‌యంలో ఆమెకు అన్ని రకాలుగా అండగా ఉంటాం’’ అని మాండవీయ తెలిపారు. దీనిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భార‌త ఒలింపిక్ సంఘం అధ్య‌క్షురాలు పీటీ ఉషను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆదేశించారు. ఈ విషయాన్ని ‘యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌’ సంఘం దృష్టికి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) తీసుకెళ్లిందని భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష వెల్లడించారు.

Tags:    

Similar News