Vagsheer: తుది దశకు ‘వాగ్షీర్‌’ ట్రయల్స్.. త్వరలోనే నౌకాదళంలోకి ప్రవేశం!

భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామి వాగ్షీర్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్నట్టు సంబంధిత అధికారులు ఆదివారం తెలిపారు.

Update: 2024-09-29 17:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామి వాగ్షీర్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్నట్టు సంబంధిత అధికారులు ఆదివారం తెలిపారు. డిసెంబర్‌ నాటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించారు. నీటి అడుగున సామర్థ్యాలను పెంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రాజెక్టు 75 కింద ఆరో జలాంతర్గామిగా వాగ్షీర్‌ను తయారు చేశారు. దీని తయారీకి రూ. 23,562 కోట్లు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ముంబైలోని మజ్‌గాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో నిర్మించారు. దీనిని ఫ్రెంచ్ నావల్ డిఫెన్స్ అండ్ ఎనర్జీ గ్రూప్ నేవల్ గ్రూప్ రూపొందించింది. యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, లాంగ్-రేంజ్ స్ట్రైక్స్, స్పెషల్ ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ వంటి వివిధ కార్యకలాపాలను ఇది నిర్వహించగలదు. 2023 మే 19న తొలి సముద్ర ప్రయోగాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే దీని ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. కాగా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి మరో మూడు జలాంతర్గాములను నిర్మించడానికి ఫ్రాన్స్‌తో భారత్ చర్చలు జరుపుతోంది.


Similar News