Uttarakhand: కేదార్‌నాథ్ నుంచి 3 వేల మందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది

ఇంకా 1,000 మంది కేదార్‌నాథ్‌లో ఎదురుచూస్తున్నారని అధికారులు వెల్లడించారు.

Update: 2024-08-02 17:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లే మార్గం దెబ్బతినడంతో శుక్రవారం రెస్క్యూ, పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన 3,000 మందిని ఇప్పటివరకు రక్షించామని, అయితే ఇంకా 1,000 మంది కేదార్‌నాథ్‌లో ఎదురుచూస్తున్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం మెరుగ్గా ఉంది. భారీ వర్షాలు లేవు. ఉత్తరకాశీకి శనివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని, తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రధాన మార్గాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. కేదార్‌నాథ్ నుంచి గౌరీకుండ్ మధ్య మార్గం మూసేయబడింది. గురువారం గౌరీకుండ్ నుంచి సోన్‌ప్రయాగ్‌కు 2,300 మందిని తీసుకొచ్చాం. 700 మందిని విమానంలో తరలించడం జరిగింది. ఇప్పటివరకు 3,000 మందిని రక్షించామని విపత్తు నిర్వహణ కార్యదర్శి పేర్కొన్నారు. ప్రస్తుతం మరో వెయ్యి మంది కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయారు. వారంతా సురక్షితంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి విపత్తు పరిస్థితి లేదు. తగిన ఆశ్రయం, ఆహార అందించాం. వారి వద్ద 15 రోజులకు సరిపడా ఆహారం ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత వైమానిక దళం సహా నాలుగు హెలికాప్టర్లను శుక్రవారం రెస్క్యూ ఆపరేషన్ కోసం మోహరించినట్లు పేర్కొన్నారు. 

Tags:    

Similar News