హిమాలయాల్లో మరణ మృదంగం.. తొమ్మిది మంది మృతి

ఉత్తరాఖండ్‌లోని పర్వతశ్రేణుల్లో ట్రెక్కింగ్ కు వెళ్లిన 9 మంది చనిపోయారు. ఎగువ హిమాలయాల్లోని సహస్త్రతల్ లేక్ దగ్గరకు 22 మందితో కూడిన బృందం ట్రెక్కింగ్ కు వెళ్లింది.

Update: 2024-06-05 15:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని పర్వతశ్రేణుల్లో ట్రెక్కింగ్ కు వెళ్లిన 9 మంది చనిపోయారు. ఎగువ హిమాలయాల్లోని సహస్త్రతల్ లేక్ దగ్గరకు 22 మందితో కూడిన బృందం ట్రెక్కింగ్ కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన వారిలో 9 మంది చనిపోగా.. మరికొందరు మంచులో చిక్కుకుపోయారు. వారిలో పదిమందిని ఉత్తరాఖండ్ డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మిగతా ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.

అసలేం జరిగిందంటే?

హిమాలయాల్లో 4 వేల 400 మీటర్ల ఎత్తులో సహస్త్రతల్ సరస్సు ఉంది. హిమాలయన్‌ వ్యూ ట్రెక్కింగ్‌ ఏజెన్సీ.. మే 29న 22 మందితో కూడిన ట్రెక్కింగ్‌ బృందాన్ని ముగ్గురు లోకల్ గైడ్లతో పాటు సరస్సు దగ్గరకు పంపింది. వారిలో 18 మంది కర్ణాటకు చెందిన వారు కాగా.. మరొకరు మహారాష్ట్ర వాసి. అయితే, ఈ ట్రెక్కింగ్ బృందం తిరుగు ప్రయాణం జూన్ 7న ఉంది. కాగా.. జూన్ 4 నాటికి కూడా వారంతా బేస్ క్యాంపుకి చేరుకోలేదు. ట్రెక్కర్లు బేస్ క్యాంపుకి చేరుకోకపోడవంతో ట్రెక్కింగ్ ఏజెన్సీ అప్రమత్తమైంది. ప్రతికూల వాతావరణం వల్ల ఆ బృందమంతా దారి తప్పినట్లు గుర్తించింది. సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా మంచులో చిక్కుకుని 9 మంది చనిపోయినట్లు తేల్చింది. మరికొందరు చిక్కుకుపోయారని అధికారులకు సమాచారమిచ్చింది. దీంతో హెలికాప్టర్ సాయంతో డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వారిలో పదిమందిని కాపాడినట్లు ఉత్తరకాశీ కలెక్టర్ తెలిపారు. సహాయచర్యల కోసం ఎయిర్ ఫోర్స్ సాయం తీసుకున్నట్లు తెలిపారు. మిగతా ముగ్గురి కోసం ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు.


Similar News