US: ఏఐతో విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్స్ స్కానింగ్..!
హమాస్ అనుకూల ఉగ్రగ్రూపులకు మద్దతిస్తున్న విదేశీ విద్యార్థులను గుర్తించేందుకు అమెరికా ఏఐ సాంకేతికతను వాడుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్ అనుకూల ఉగ్రగ్రూపులకు మద్దతిస్తున్న విదేశీ విద్యార్థులను గుర్తించేందుకు అమెరికా ఏఐ సాంకేతికతను వాడుతోంది. ఉగ్రవాద అనుకూల పోస్ట్‌లు, స్టోరీలకు ఇన్‌స్టాలో లైక్ కొట్టినా గుర్తించేలా ట్రంప్ యంత్రాంగం టెక్నాలజీని వాడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నాయకత్వంలో అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పట్నుంచి ఇప్పటివరకు వారికి మద్దతుగా ఎవరెవరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు, ఎవరు వాటిని లైక్, షేర్ చేశారనే విషయాలు తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లను స్కాన్ చేస్తున్నట్లు యాక్సియోస్ (Axios) అనే నివేదిక వెల్లడించింది. నివేదికలోని వివరాల ప్రకారం.. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అంకౌంట్లపై కొంతకాలంగా ఏఐ నిఘా కొనసాగుతోంది. విద్యార్థులు వారు చేసిన పోస్ట్‌లను తొలగించినప్పటికీ ప్రభుత్వ విభాగాల వద్ద వాటి స్క్రీన్‌షాట్‌లు ఉంటాయని నివేదికలో పేర్కొంది. బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో బహిష్కరణ వేటు పడినప్పటికీ యూఎస్‌లోనే ఉంటున్న అక్రమ వలసదారులను గుర్తించేందుకు కూడా ట్రంప్ సర్కారు ఏఐ టెక్నాలజీని వాడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు లక్షకు పైగా విదేశీయుల ప్రొఫైల్‌లను ఫెడరల్ అధికారులు స్కాన్ చేశారు. మరోవైపు, 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాకు రికార్డు స్థాయిలో 11 లక్షల మంది విదేశీ విద్యార్థులు వచ్చారని.. వీరిలో 3 లక్షలకు పైగా భారత్ నుంచి వచ్చిన వారే అని ఓపెన్ డోర్స్ నివేదిక పేర్కొంది.
ట్రంప్ సర్కారు నిర్ణయం
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న అన్ని విషయాలపై ఉక్కుపాదం మోపారు. ఇందులోభాగంగానే జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపైనా కన్నేశారు. క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని (USA) విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ ఉగ్రసంస్థలకు అనుకూలంగా ఉన్నట్లు తేలితే ఆ విద్యార్థులకు అమెరికాలో చదువుకునే వీల్లేకుండా తక్షణమే స్వదేశానికి పంపించే యోచనలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈమేరకు అమెరికా విదేశాంగశాఖ, కాన్సులేట్ అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, హెచ్చరిక సందేశాలు అందుకున్నవారు.. తమ స్వదేశాలకు వెళ్లేందుకు సీబీపీ హోమ్ యాప్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది.