పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా కీలక ప్రకటన

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా కుట్ర పన్నాడనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-01-11 15:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా కుట్ర పన్నాడనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అమెరికా దర్యాప్తు సంస్థలు నేరాభియోగాలను నమోదు చేశాయి. దీంతో న్యూయార్క్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో జనవరి 4న పిటిషన్‌ వేసిన నిఖిల్‌ గుప్తా తరఫు న్యాయవాది.. అభియోగాలకు సంబంధించిన ఆధారాలను ఇవ్వాలని అమెరికా దర్యాప్తు సంస్థలను కోరారు. ఈ పిటిషన్‌పై తాజాగా ఇరుపక్షాలు కోర్టు ఎదుట వాదనలు వినిపించాయి. ‘‘నిఖిల్‌ గుప్తాపై నేరాభియోగాలు మోపిన అమెరికా వాటిని బలపర్చే డాక్యుమెంట్స్‌ను అందజేయలేదు. అతడి తరఫు న్యాయవాదులకు సమాచారం ఇవ్వకుండానే జైల్లో నిఖిల్‌ను అమెరికా అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. ఈ కేసులో నిఖిల్‌ను విచారించే ముందు కేసుకు సంబంధించిన వివరాలను మాకు అందజేయాలి’’ అని గుప్తా తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అయితే ఇందుకు అమెరికా ప్రభుత్వం నిరాకరించింది. ఈ కేసులో నిఖిల్ గుప్తా న్యూయార్క్‌ కోర్టులో హాజరైనప్పుడు మాత్రమే తాము ఆధారాలను అందజేస్తామని తెలిపింది. ‘‘చెక్‌ రిపబ్లిక్‌ దేశంలోని ప్రాగ్‌ జైల్లో ఉన్న నిఖిల్‌ను అమెరికా దర్యాప్తు అధికారులు రెండు సార్లే కలిశారు. ఆ సందర్భాల్లోనూ అతడి హక్కులను ఉల్లంఘించలేదు. న్యాయవాదుల సమక్షంలోనే అతడిని ప్రశ్నించారు’’ అని అమెరికా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. నిఖిల్‌ గుప్తాను గతేడాది జూన్‌లో చెక్‌ రిపబ్లిక్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాగ్‌ జైల్లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకోవడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.

Tags:    

Similar News