'ముంబయి 26/11 ఉగ్రదాడి నిందితుడిని భారత్‌కు అప్పగించండి'.. అమెరికా కోర్టు ఆదేశం
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో కీలక నిందితుడిగా ఉన్న 62 ఏళ్ల తహవ్వుర్ రాణాను భారత్‌కు తీసుకురావడానికి మార్గం సుగమమైంది.
వాషింగ్టన్: 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో కీలక నిందితుడిగా ఉన్న 62 ఏళ్ల తహవ్వుర్ రాణాను భారత్‌కు తీసుకురావడానికి మార్గం సుగమమైంది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు ఆమోదం తెలిపింది. అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి.. త్వరలోనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తహవ్వుర్ ను మన దేశానికి తీసుకురానుంది. తహవ్వుర్ రాణా పాక్ సంతతికి చెందిన కెనడా పౌరుడు. అతడు లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కలిసి 26/11 ఉగ్ర దాడులకు కుట్ర పన్నాడు. నేరస్థుల అప్పగింత ఒప్పందంలో భాగంగా తహవ్వుర్‌ను తమకు అప్పగించాలంటూ భారత సర్కారు అమెరికాను పలుమార్లు అరెస్టు చేసింది.
ఈ క్రమంలో లాస్ ఏంజిల్స్ పోలీసులు 2020లో అతడిని అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్న రాణాకు కరోనా సోకిందని పేర్కొంటూ విడుదల చేశారు. కొద్దిరోజుల పాటు అతడు బయటే ఉన్నాడు. అయితే, అతడి అరెస్ట్ కోసం భారత ప్రభుత్వం మరోసారి అభ్యర్థన చేసింది. దీంతో 2020 జూన్ 10న మరోసారి రాణాను లాస్ ఏంజిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాణాను ఇండియాకు అప్పగించే వ్యవహారంపై తాజాగా మే 16న అమెరికా కోర్టులో విచారణ జరిగింది.
"పాకిస్థానీ-అమెరికన్ డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ.. తహవ్వుర్ రాణా ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో హెడ్లీకి సంబంధం ఉందనే విషయం రాణాకు ముందే తెలుసు. హెడ్లీకి సహాయం చేయడం, అతని కార్యకలాపాలకు రక్షణ కల్పించడం ద్వారా తహవ్వుర్ రాణా లష్కరే తోయిబాకు మద్దతు ఇచ్చాడు. ముంబై ఉగ్ర దాడులకు సంబంధించిన ప్రణాళికపైనా రాణాకు అవగాహన ఉంది" అని అమెరికా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. వీటిని విన్న న్యాయమూర్తి రాణాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించారు. ఇక రాణా తరపు న్యాయవాది.. ఇండియాకు అతడి అప్పగింతను వ్యతిరేకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 22న అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్రవాది రాణా అప్పగింతకు అమెరికా కోర్టు అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో 166 మంది మృతి చెందారు.