కేజ్రీవాల్ అరెస్టుపై యూఎస్ వ్యాఖ్యలు: భారత్ తీవ్ర ఆగ్రహం

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఇటీవల జర్మనీ వ్యాఖ్యలు చేయగా భారత్ ఆ దేశ రాయబారిని వివరణ కోరిన విషయం తెలిసిందే.

Update: 2024-03-27 09:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఇటీవల జర్మనీ వ్యాఖ్యలు చేయగా భారత్ ఆ దేశ రాయబారిని వివరణ కోరిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా సైతం కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించింది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మంగళవారం మాట్లాడుతూ..భారత్‌లో సీఎం అరెస్టుపై పరిణామాలను యూఎస్ నిశితంగా పరిశీలిస్తోందని, ఈ కేసులో పారదర్శక విచారణను కోరుకుంటున్నామని తెలిపారు. ఈ వ్యాఖ్యలను భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బర్బోనాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పిలిపించుకుని..ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై ఆమెతో సుమారు 40నిమిషాల పాటు చర్చలు జరపగా ఈ భేటీలో భారత్ సీరియస్ అయింది. ‘ఇతర దేశాల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యహారాలను గౌరవించాలని మేము భావిస్తున్నాం. తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. లేదంలే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది’ అని విదేశాంగ శాఖ తెలిపింది. భారత న్యాయవ్యవస్థ స్వతంత్రతను కలిగి ఉంటుందని పేర్కొంది.

Tags:    

Similar News