బిచ్చమేశాడని కేసు బుక్ చేసిన పోలీసులు

భిక్షాటన నిర్మూలన బృందానికి చెందిన అధికారి భన్వార్కువాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Update: 2025-01-23 18:38 GMT
బిచ్చమేశాడని కేసు బుక్ చేసిన పోలీసులు
  • whatsapp icon

- నేరం రుజువైతే జైలు శిక్ష

- ఇండోర్‌లో అరుదైన ఘటన

దిశ, నేషనల్ బ్యూరో:

గుడి ముందు యాచిస్తున్న మహిళకు బిచ్చమేశాడని గుర్త తెలియని వ్యక్తిపై ఇండోర్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. దేశంలో బిక్షగాళ్లు లేని తొలి నగరంగా ఇండోర్‌ను తీర్చిదిద్దాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా అధికార యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంటుంది. నగరంలో ఎవరైనా భిక్షమెత్తినా లేదా భిక్షం వేసినా, రోడ్ల వెంట బిక్షగాళ్లు వస్తువులను అమ్మినా, వారి వద్ద నుంచి కొన్నా ఇండోర్ ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే ఖాండ్వా రోడ్డులోని ఒక దేవాలయం ముందు ఉన్న యాచకురాలికి గుర్తు తెలియని వ్యక్తి బిచ్చం వేశాడు. దీంతో భిక్షాటన నిర్మూలన బృందానికి చెందిన అధికారి భన్వార్కువాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిచ్చం వేసిన వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే ఏడాది పాటు జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా లేదంటే రెండింటినీ అమలు చేసే అవకాశం ఉంటుంది. యాచకులు లేని నగరాలను రూపొందించాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ దేశంలోని 10 నగరాల్లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో ఇండోర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు హైదరాబాద్ కూడా ఉంది. అయితే ముందుగా ఇండోర్ అధికారులు భిక్షాటనపై కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. భిక్షాటన గురించి ఎవరైనా సమాచారం అందిస్తే వారికి రూ.1,000 రివార్డు కూడా అందిస్తున్నారు.

Tags:    

Similar News