'మూడు రంగుల' ఏకత్వం..! మన ఫుట్‌బాల్ ప్లేయర్ల వైరల్ పిక్
భిన్నత్వమే లేకుండా భారతదేశ ఉనికే లేదన్నది సత్యం. Unity in Diversity Image Of Indian Footballers Praying Together
దిశ, వెబ్‌డెస్క్ః 'భిన్నత్వంలో ఏకత్వం' అనేది భారత సంస్కృతిలో ప్రధాన అంశం. అలాంటి భిన్నత్వమే లేకుండా అసలు భారతదేశ ఉనికే లేదన్నది చారిత్రక సత్యం. అయితే, ఇండియాలో ఈమధ్య తరచుగా చోటుచేసుకుంటున్న మతవిద్వేషపూరిత పరిస్థితులకు భిన్నంగా ఇండియన్ ఫుట్‌బాల్ సభ్యుల ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇటీవల బెలారస్‌తో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో మ్యాచ్‌లో 0-3 తేడాతో భారత ఫుట్‌బాల్ జట్టు తన బహ్రెయిన్ పర్యటనను ముగించుకుంది. ఈ మ్యాచ్‌కి ముందు ముగ్గురు భారతీయ క్రీడాకారులు మైదానంలోకి అడుగుపెడుతున్న క్రమంలో వారివారి విశ్వాసాల ప్రకారం ప్రార్థనలు చేస్తున్న సందర్బాన్ని కెమెరా బంధించింది.
ఈ చిత్రాన్ని మరికొన్ని ఇతర చిత్రాలతో పాటు భారత ఫుట్‌బాల్ జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. భారతదేశ వాస్తవ సంస్కృతిని ఉట్టిపడేలే చేసిన ఈ ప్రత్యేకమైన ఫోటో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అన్ని విశ్వాసాలను గౌరవించే మతసమానత్వాన్ని ఫుట్‌బాల్ జట్టు ఎలా పాటిస్తుందో తెలుసుకొని, సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కామెంట్లతో మతసామరస్యతను చాటుతున్నారు.