అఫిడవిట్‌పై ప్రమాణం చేయని కారణంగా శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణ
నిబంధనలకు విరుద్ధం కావడంతో నామినేషన్ ఫారమ్ తిరస్కరించినట్టు ఎన్నికలు అధికారులు పేర్కొన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల కీలక నేతల గురించి ఎక్కువ చర్చ జరగడం సహజం. వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు, ప్రచార శైలి, నామినేషన్ పత్రాలు ఇలా ప్రతీ అంశాన్ని ప్రజలు ఆసక్తిగా చూస్తారు. అలాంటిదే దేశ ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసిపై కూడా ఎక్కువమంది ఆసక్తి ఉంది. మిగిలిన అంశాల కంటే ఇటీవల ఎక్కువ చర్చలోకి వచ్చిన వాటిలో మోడీపై ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ శ్యామ్ రంగీలా పోటీకి దిగడం. అనేక ఇబ్బందుల తర్వాత వారణాసి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అతనికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. నామినేషన్ అసంపూర్తిగా ఉందని, అఫిడవిట్‌పై ప్రమాణాన్ని నెరవేర్చలేదని, నిబంధనలకు విరుద్ధం కావడంతో నామినేషన్ ఫారమ్ తిరస్కరించినట్టు ఎన్నికలు అధికారులు పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రధానమంత్రికి గట్టి మద్దతుదారుగా కనిపించిన రంగీలా, మోడీని అనుకరిస్తూ మిమిక్రీ చేయడం ద్వారా పేరును సంపాదించుకున్నారు. ఈసారి ఆయనపై ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే, తన నామినేషన్ తిరస్కరణకు గురైన తర్వాత, ఎన్నికల్లో పోటీ చేసే పౌరుల హక్కును హరించారని, తాను గెలుస్తానన్న నమ్మకం లేనప్పటికీ, సందేశం పంపాలనుకుంటున్నానని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తన నామినేషన్‌ను తిరస్కరించారన్నారు.