జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం.. ఆ కమిటీ రద్దు చేయండి : ఖర్గే

దిశ, నేషనల్ బ్యూరో : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Update: 2024-01-19 12:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనే అప్రజాస్వామికమైందని ఆయన మండిపడ్డారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థకు ఉన్న రక్షణలకు, రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణానికి జమిలి ఎన్నికలు పూర్తి విరుద్ధమైనవని తెలిపారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌పై అధ్యయనానికి ఏర్పాటుచేేసిన హైపవర్ కమిటీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఖర్గే డిమాండ్ చేశారు. ఈమేరకు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌ కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ‘‘మీ వ్యక్తిత్వాన్ని, భారత మాజీ రాష్ట్రపతిగా మీ హోదాను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడానికి అనుమతించకండి. జమిలి ఎన్నికలు దేశంలో రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయి’’ అని కమిటీ సారథి, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఈ లేఖలో ఆయన అభ్యర్థించారు. జమిలి ఎన్నికలపై సూచనలను ఆహ్వానిస్తూ అక్టోబరు 18న కమిటీ కార్యదర్శి నితేన్ చంద్ర రాసిన లేఖకు రాతపూర్వకంగా బదులిస్తూ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జరుగుతున్నదంతా చూస్తుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. సంప్రదింపులు జరపడం, సూచనలను ఆహ్వానించడం కంటితుడుపు చర్యలేనని అనిపిస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘జమిలి ఎన్నికల వంటి వాటిపై చర్చించడం ఆపేసి.. ప్రజల ఆదేశాన్ని గౌరవించేలా ప్రభుత్వం, పార్లమెంటు, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి పని చేయాలి’’ అని ఖర్గే కోరారు.

Tags:    

Similar News