Uddhav Thackeray : సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలి.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన డిమాండ్
వీర్ సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : వీర్ సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. మంగళవారం నాగ్‌పూర్‌లో జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వీర్ సావర్కర్‌కు భారత రత్న ఎప్పుడు ప్రధానం చేస్తారో బీజేపీ చెప్పాలన్నారు. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పుడు సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఆయనే సీఎంగా ఉన్నా బీజేపీ ఈ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సావర్కర్‌ను, బీజేపీ నెహ్రూను టార్గెట్ చేయడం ఆపాలని ఉద్ధవ్ ఠాక్రే హితవు పలికారు. గతాన్ని తవ్వుకోవడం కంటే భవిష్యత్తు నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. ఈ ఇద్దరు నేతలు ఆనాడు తీసుకున్న నిర్ణయాలు ఆ సమయానికి సరైనవే అని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ సైతం పదే పదే నెహ్రూ పేరును ప్రస్తావించడం మానుకోవాలన్నారు. ఈ అంశంపై శివసేన(షిండే) నేత, మంత్రి భరత్ గొగవలే స్పందిస్తూ.. వీర్ సావర్కర్‌కు భారతరత్న విషయంలో మహాయుతి కూటమి నేతలంతా సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు. హిందుత్వను వదిలేసిన ఉద్దవ్ ఠాక్రేకు వీర్ సావర్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని ఫైర్ అయ్యారు.