డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం

తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మరో నలుగురికి కొత్తగా చోటు కల్పించారు.

Update: 2024-09-29 11:43 GMT

దిశ, వెబ్ డెస్క్ :  తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మరో నలుగురికి కొత్తగా చోటు కల్పించారు. మనీలాండరింగ్ కేసులో 15 నెలల పాటు జైలు వెళ్లి, రెండు రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ మంత్రిగా ప్రమాణం చేసిన వారిలో ఉండటం రాజకీయ వర్గాలను అశ్చర్యపరిచింది. డాక్టర్ గోవి చెళియాన్, ఆర్. రాజేంద్రన్, ఎస్ఎం. నాసర్ లు కూడా మంత్రి మండలిలో చోటుదక్కించుకున్నారు. ఆదివారం రాజభవన్ లో వీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. దీనితో పాటు, ఆయనకి ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ శాఖలను అదనపు బాధ్యతలుగా అప్పగించారు. ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, దిగ్గజ ద్రావిడ నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి 'కళైంజ్ఞర్' కరుణానిధి మనవడన్న విషయం తెలిసిందే.

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సెంథిల్ కు విద్యుత్, ఎక్సైజ్ శాఖలు, చెళియన్ కు విద్యాశాఖ, నాజర్ కు మైనార్టీ వ్యవహారాలు, రాజేంద్రన్ కు పర్యటక శాఖలను కేటాయించారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న ఉదయనిధి ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మళ్లీ ప్రమాణం చేయలేదు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి బయలుదేరేముందు మీడియాతో మాట్లాడిన ఆయన ఉపముఖ్యమంత్రి అనేది తనకు ఆది పదవి కాదని, ఓ పెద్ద బాధ్యతని అన్నారు. మరోవైపు ఉదయనిధికి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 


Similar News