MP: భోపాల్‌లోని వాన్ విహార్ నేషనల్ పార్క్‌లో చికిత్స పొందుతూ రెండు పులి పిల్లల మృతి
బుద్నీలో రైలు ఢీకొని గాయపడిన రెండు పులి పిల్లలు చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు ప్రకటించారు.
దిశ, నేషనల్ బ్యూరో: సెహోర్ జిల్లాలోని బుద్నీలో రైలు ఢీకొని గాయపడిన రెండు పులి పిల్లలు రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని వాన్ విహార్ నేషనల్ పార్క్‌లో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మిడ్‌ఘాట్ ట్రాక్ వద్ద పిల్లలను రక్షించి వాన్ విహార్ నేషనల్ పార్క్‌కు తీసుకువచ్చిన అధికారులు చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే, మంగళవారం ఉదయం ఒక పిల్ల, బుధవారం మరొకటి మరణించాయి. 'రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రెండు పులి పిల్లలను జూలై 16న మిడ్‌ఘాట్ రైల్వే లైన్ బుద్నీ నుంచి రక్షించి వాన్ విహార్ నేషనల్ పార్క్‌కు తీసుకువచ్చారు. రెండు పులి పిల్లలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు, ఎక్స్-రేలు తీశారు. జూలై 17న వన్యప్రాణి వైద్యులు, ఇతర వైద్య బృందం నిరంతర చికిత్స అందించారు. అయితే, జూలై 30న మంగళవారం ఉదయం ఒక పులి పిల్ల మరణించింది. చాలా తీవ్రంగా గాయపడిన రెండవ పులి పిల్ల కూడా బుధవారం మరణించింది' అని అధికారిక ప్రకటన వెలువడింది. తీవ్రంగా గాయపడిన రెండు పులి పిల్లలను అబ్జర్వేషన్‌లో ఉంచామని, నిపుణులతో సంప్రదించి వాటికి నిరంతర చికిత్స అందిస్తున్నామని అంతకుముందు వైద్యులు తమ ప్రకటనలో తెలిపారు. కానీ రెండు పులి పిల్లల వెనుక భాగంలో తీవ్రమైన గాయం కారణంగా, వాటి వెనుక భాగం చలనాన్ని కోల్పోయాయి. పులి పిల్లలు కావాల్సినంత ఆహారం, నీరు తీసుకోలేదు. దాంతో వాటి ఆరోగ్య పరిస్థితిలో ఆశించిన స్థాయిలో మెరుగవలేదు. మెరుగైన చికిత్స అందించినప్పటికీ, పులి పిల్లలను రెండింటినీ రక్షించలేకపోయామని ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం సీనియర్ అధికారుల సమక్షంలో వాన్ విహార్ నేషనల్ పార్క్‌లో ప్రోటోకాల్ ప్రకారం పులి పిల్లను దహనం చేశామని వెల్లడించారు.